న్యూఢిల్లీ: ప్రభుత్వ అభిప్రాయాలకు వ్యతిరేకమైన భావాలను వ్యక్తం చేస్తే దేశ ద్రోహిగా పేర్కొనలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను బుదవారం నాడు సుప్రీంకోర్టు కొట్టేసింది. జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ 2019 ఆగష్టులో కేంద్రం నిర్ణయం తీసుకొంది.  దీన్ని ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయమై ఫరూక్ అబ్దుల్లాపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ను పునరుద్దరించేందుకు పాక్, చైనాల సహాయాన్ని తీసుకొంటూ దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని ఫరూక్ అబ్దుల్లాపై  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 

ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు బుధవారం నాడు విచారణ చేసింది. ప్రభుత్వ అభిప్రాయాలను వ్యతిరేకిస్తే దేశ ద్రోహంగా పరిగణించలేమని కోర్టు అభిప్రాయపడింది.అబ్దుల్లాపై చేసిన ఆరోపణలను రుజువు చేయడంలో ఫిర్యాదు చేసిన వ్యక్తి విఫలమైనందున పిటిషన్ ను కొట్టివేస్తున్నట్టుగా కోర్టు ప్రకటించింది. అంతేకాదు పిటిషనర్ కు రూ. 50 వేల జరిమానాను విధించింది.