ఢిల్లీలో రైతుల ఆందోళన నేపథ్యంలో పంజాబ్‌లో రాజకీయ దుమారం రేగుతోంది. ముఖ్యంగా శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ నేతలు మాటల యుద్ధం శృతిమించుతోంది. అకాలీ దళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బిర్‌ సింగ్‌ బాదల్‌ తనపై చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌‌ తీవ్రంగా ఖండించారు.

రైతుల ఉద్యమం విషయంలో తనను ఓ ఉత్త బఫూన్‌ అనటమే కాకుండా తన కుటుంబంపై ఉన్న ఈడీ కేసులను ప్రస్తావించటంపై సీఎం మండిపడ్డారు. శనివారం బాదల్‌‌కు అమరీందర్ కౌంటరిచ్చారు. తాను బాదల్‌ లాగా వెన్నెముక లేని వాడిని, దేశ ద్రోహిని కానని స్పష్టం చేశారు.

రైతులకు వారు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మీరు, మీ శిరోమణి అకాలీ దళ్‌ అధికార దాహంతో కళ్లు మూసుకుపోయి పాకిస్తాన్‌ నుంచి మన రాష్ట్ర భద్రతకు పొంచి ఉన్న ముప్పును పట్టించుకోవటం లేదని అమరీందర్ సింగ్ ఎద్దేవా చేశారు.

పంజాబ్‌ సరిహద్దుల వెంట భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రి, డ్రోన్లతో ఎలాంటి ప్రమాదం లేదని అంటారా అని ముఖ్యమంత్రి మండిపడ్డారు. తాను అకస్మాత్తుగా వణికిపోవటానికి తనపై ఎలాంటి ఈడీ కేసులు లేవని అమరీందర్ సింగ్ దుయ్యబట్టారు.