జైపూర్: తనను పనికిరానివాడని రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ చెప్పారు.

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీతో కలిసి రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా తనపై ఆరోపణలు చేసినా కూడ ఆయననను గౌరవిస్తానని ఆయన ప్రకటించారు. ఇతరులతో సహా నా బద్ద శత్రువులను నేను ఎంత వ్యతిరేకించినా వారిపట్ల తాను ఇలాంటి మాటలు ఉపయోగించనని చెప్పారు. 

నా కుటుంబం నుండి ఈ విలువలను నేర్చుకొన్నానని ఆయన తేల్చి చెప్పారు. వ్యక్తిగతంగా ఆశోక్ గెహ్లాట్ ను తాను ఎంతో గౌరవిస్తానని ఆయన చెప్పారు.రాజకీయాల్లో అసూయ, వ్యక్తిగత శతృత్వానికి స్థానం లేదన్నారు. కానీ పరిపాలనలో తన అభిప్రాయాలను వ్యక్తపర్చే హక్కు తనకు ఉందన్నారు. కానీ గెహ్లాట్ వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. వాటిపై తాను స్పందించాలనుకోవడం లేదన్నారు.

also read:రాజస్థాన్ కాంగ్రెస్‌లో ముగిసిన సంక్షోభం: కాంగ్రెస్ గూటికి తిరిగి సచిన్ పైలెట్

మాట్లాడే సమయంలో సరైన భాషను ఉపయోగించాలని ఆయన కోరారు. ఇతరుల గురించి మాట్లాడే సమయంలో భాషాపరమైన లక్ష్మణ రేఖ ఉంటుందని, తాను 20 ఏల్లుగా తన జీవితంలో లక్ష్మణ రేఖను దాటలేదన్నారు.

జూలై 12 తర్వాత సచిన్ పైలెట్ మంగళవారం నాడు ఆయన జైపూర్ కు తిరిగి వచ్చారు. ఈ సమయంలో సీఎం గెహ్లాట్ జైసల్మార్ కు వెళ్లారు.తన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రయత్నించిన సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీతో పాటు పార్టీలోని ఇతర ముఖ్య నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తాను ఎలాంటి పదవులను పార్టీని కోరలేదన్నారు. పార్టీ కార్యకర్తల గౌరవం కోసమే తాను ఈ సమస్యలను లేవనెత్తినట్టుగా ఆయన చెప్పారు.