‘‘నన్ను డబ్బుతో కొనేవాడు పుట్టలేదు.’’ అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ముస్లిం ఓట్లను విభజించడానికి బీజేపీ కొన్ని కోట్లను ఖర్చు చేసి, హైదరాబాద్ నుంచి నేతలను రప్పిస్తున్నారు.’’ అంటూ సీఎం మమతా బెనర్జీ విమర్శించిన నేపథ్యంలో ఒవైసీ పై వ్యాఖ్యలు చేశారు. 

‘‘సీఎం మమత వ్యాఖ్యలు నిరాధారం. ఆమె తన పార్టీ గురించి తీవ్ర ఆందోళన చెందుతోంది. చాలా మంది నేతలు బీజేపీలోకి వెళ్లిపోతున్నారు. బిహార్ లో మాకు ఓట్లు వేసిన వారిని మమత కించపరుస్తున్నారు.’’ అంటూ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. 

‘‘ముస్లిం ఓట్లను చీల్చడానికి బీజేపీ కోట్లకు కోట్లు ఖర్చు చేస్తోంది. హైదరాబాద్ లో ఉన్న పార్టీని రప్పిస్తోంది. హిందువుల ఓట్లు బీజేపీకి, ముస్లిం ఓట్లు హైదరాబాద్ పార్టీకి పడేలా బీజేపీ వ్యూహం వేసింది. బిహార్ ఎన్నికల్లో బీజేపీ వేసిన అస్త్రం అదే. ఆ పార్టీ బీజేపీకి ‘బీ టీమ్’’.’’ అని మమతా బెనర్జీ తీవ్రంగా దుయ్యబట్టారు. 

పశ్చిమ బెంగాల్ సరిహద్దులో బీహార్‌లోని ముస్లిం ఆధిపత్య సీమాంచల్ ప్రాంతంలో ఎఐఎంఐఎం ఐదు స్థానాలను గెలుచుకుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపరిణామాల నేపథ్యంలో ఒవైసీ పార్టీ  వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది.

"ఇప్పటివరకు మీరు విధేయుడైన మీర్ జాఫర్స్, సాదిక్‌లను మాత్రమే చూశారు. తమ గురించి తాము ఆలోచించే, మాట్లాడే ముస్లింలను మీరు ఇష్టపడరు. బీహార్‌లోని మా ఓటర్లను మీరు అవమానించారు. తమ వైఫల్యాలను వారి మీద వేస్తూ వోట్లను చిల్చే వ్యక్తులంటూ వారిని దూషిస్తున్న పార్టీలకు ఏం జరిగిందో గుర్తుంచుకోమని హెచ్చరించారు. అంతేకాదు ‘ముస్లిం ఓటర్లు మీ జాగీర్ కాదు' అని తృణమూల్ చీఫ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఓవైసీ ట్వీట్ చేశారు.

వచ్చే ఏడాది బెంగాల్‌లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టుతుందని ఓవైసీ ప్రకటించడంపై విశ్లేషకులు మాట్లాడుతూ దీనివల్ల మైనారిటీ ఓట్లను విభజించి, తృణమూల్‌ను దెబ్బతీస్తుందని, ఇది ముస్లిం ఓటును పూర్తిగా రాబట్టుకుంటుందని అన్నారు.

మైనారిటీ ఓట్లు చీలడం అంటే తృణమూల్‌కు తక్కువ ఓట్లు రావడమే. అందువల్ల, బెంగాల్‌లో AIMIM ని కూల్చేయడం, దాని సభ్యులను తృణమూల్‌లో చేర్చుకోవడం మాస్టర్‌స్ట్రోక్ అని విశ్లేషకులు తెలిపారు.