బెంగళూరు: గత కొద్దిరోజులుగా కురుస్తున్నభారీ వర్షాలకు దక్షిణాది రాష్ట్రాలు కకావికలమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరకర్ణాటక జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. 

వరదల కారణంగా నానా పాట్లు పడుతున్న వారిని ఆదుకునేందుకు బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం ఎంపీ ల్యాండ్స్ నుంచి కోటి రూపాయలను తక్షణ విరాళంగా ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలకు ఈ నిధులు ఉపయోగించాలని సూచించారు. 

వరదల ప్రభావం నార్త్  కర్ణాటకకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టిందని ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 

అనేక మంది తన ఆవాసాలను సైతం కోల్పోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాను తన ఎంపీ నిధుల నుంచి తక్షణమే పునరావాస చర్యలు చేపట్టాలంటూ కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వ్యాపార వేత్తలు, మనసున్న మారాజులు వరదప్రభావిత ప్రాంతాలను ఆదుకోవాలని కోరారు.

ఇకపోతే వరద ప్రభావంగా నార్త్ కర్ణాటకలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి ప్రకోపానికి బలయ్యారు. కర్ణాటకలో వరద బాధితులను ఆదుకునేందుకు ఇన్పోఫిసిస్ చైర్ పర్సన్ సుధామూర్తి రూ.10  కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందజేసినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పష్టం చేశారు. 

గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఉత్తర కర్ణాటకలో జలజీవనం స్థంభించిపోయింది. సుమారు 40వేల మంది ప్రజలు సర్వం కోల్పోయిన సంగతి తెలిసిందే.