బ్లాక్ ఫంగస్ ఇప్పుడు దేశాన్ని వణికిస్తోన్న మరో కొత్త వ్యాధి. కరోనా నుంచి కోలుకున్నవారిలో ఎక్కువగా కనిపిస్తోన్న ఈ ఇన్ఫెక్షన్ బారిన రోజుకు పదుల సంఖ్యలో గురవుతున్నారు. 

ఒకవైపు కరోనాతో తీవ్రంగా అల్లాడుతున్న దేశాన్ని మరోవైపు బ్లాక ఫంగస్ వణికిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న రోగులకు సోకుతూ ప్రాణాంతకంగా మారుతోంది. 

కోవిడ్ చికిత్స కోసం స్టిరాయిడ్లు ఎక్కువగా ఉపయోగిస్తుండడంతో రోగిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వారి మీద వాతావరణంలో ఉండే మ్యూకోర్ మైకోసిస్ దాడి చేసి శరీరంలోని కీలక అవయవాలను దెబ్బతీస్తోంది.

కోవిడ్ చికిత్స తీసుకన్న రోగులకు బ్లాక్ ఫంగస్ సోకుతుండడానికి గల మరోకారణాన్ని అహ్మదాబాద్ కు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ అతుల్ అభ్యంకర్ తాజాగా బయటపెట్టారు. 

ఆక్సీజన్ ఎక్కించేటప్పుడు ఉపయోగించే హ్యుమిడిఫయర్లే బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి ప్రధాన కారణమని అతుల్ అభిప్రాయపడుతున్నారు. ఆక్సీజన్ ను ఉపయోగించే హ్యుమిడిఫయర్లలో స్టెరైల్ నీటినే వాడాలి.

కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్ లోనూ, కోవిడ్ కేర్ సెంటర్లలోనూ, ఇళ్లలో ఆక్సిజన్ పెట్టుకుంటున్న వారు సాధారణ నీటినే వాడేస్తున్నారు. ఆ నీటిలో ఉండే సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించి బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి కారణమవుతున్నాయి. దీనికి నివారించాలంటే హ్యుమిడిఫయర్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. రోజుకు రెండు సార్లు నీటిని మార్చాలని సూచించారు. 

బ్లాక్ ఫంగస్ డేంజర్ బెల్స్ : ఉత్తరప్రదేశ్ లో ఒకేసారి 73 కేసులు..వారణాసిలోనే ఎక్కువ.....

కాగా, ఉత్తరప్రదేశ్‌ను బ్లాక్ ఫంగస్ కేసులు కలవరపెడుతున్నాయి. ఇప్పటివరకు 73 అరుదైన ‘బ్లాక్ ఫంగస్’ ఇన్‌ఫెక్షన్ కేసులు కోవిడ్ -19 రోగులలో బయటపడ్డాయి. వీటిలో గరిష్టంగా వారణాసిలో బయటపడ్డాయి. 

ఇప్పటివరకు వారణాసిలో 20, లక్నో 15, గోరఖ్‌పూర్‌లో 10, ప్రయాగ్రాజ్‌లో ఆరు, గౌతమ్ బుద్ధ నగర్‌లో ఐదు, మీరట్‌లో నాలుగు, కాన్పూర్, మధుర, ఘజియాబాద్‌లో మూడు కేసులు, ఆగ్రాలో ఒక కేసు నమోదయ్యాయి. 

బ్లాక్ ఫంగస్ కారణంగా కాన్పూర్‌లో ఇద్దరు కోవిడ్ -19  రోగులు మరణించారు. కాగా మధురాలో ఇద్దరు, లక్నోలో ఒకరు బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ కారణంగా కంటి చూపు కోల్పోయారు.