న్యూఢిల్లీ: నోయిడాలో విషాదకరమైన సంఘటన జరిగింది. తన మైనర్ కూతురిని చంపి ఓ మహిళ తాను ఆత్మహత్య చేసుకుంది. నోయిడా సెక్టార్ 128లో ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. అంతకు ముందు ఆమె భర్త జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం స్టేషన్ లో మెట్రో ట్రాక్ పై రైలు వస్తుండగా దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

అయితే, ఆ వ్యక్తి గానీ అతని భార్య గానీ సూసైడ్ నోట్ రాసినట్లు లేదు. చెన్నైకి చెందిన 33 ఏళ్ల భర్త తన కుటుంబ సభ్యులతో నోయిడాలోని సెక్టార్ 128 రెసిడెన్షియల్ సొసైటీలో నివసిస్తున్నాడు. రైలు ముందు దూకిన భరత్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తేల్చారు. 

ఆ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత అతని భార్య తన ఐదేళ్ల కూతురికి ఉరేసి, తాను ఉరివేసుకుంది. వారి శవాలను ఇంటిలోని సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాయి. 

మహిళ తన భర్త శవాన్ని గుర్తించడానికి ఆర్ఎంఎల్ ఆస్పత్రికి వెళ్లిందని, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె కూతురిని తీసుకుని ఓ గదిలోకి వెళ్లి గడియ వేసుకుందని సర్కిల్ ఆఫీసర్ స్వేతాభ్ పాండే చెప్పారు. కుటుంబ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతోందని మహిళ సోదరుడు పోలీసులకు చెప్పాడు. 

మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.