Asianet News TeluguAsianet News Telugu

నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత.. 10 సెకన్లలోనే నేలమట్టం.. వీడియో..

నోయిడాలో కుతుబ్ మినార్ కంటే ఎత్తైన సూపర్‌టెక్ ట్విన్ టవర్స్‌ను ఈరోజు కూల్చివేశారు. ఎమరాల్డ్ కోర్టు సొసైటీ ఆవరణలో నిబంధనలకు విరుద్ధంగా ట్విన్ టవర్స్ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించడంతో సుప్రీంకోర్టు వాటి కూల్చివేతకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు.
 

Noida Supertech Twin Towers Demolition completed
Author
First Published Aug 28, 2022, 2:37 PM IST

నోయిడాలో కుతుబ్ మినార్ కంటే ఎత్తైన సూపర్‌టెక్ ట్విన్ టవర్స్‌ను ఈరోజు కూల్చివేశారు. కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే ట్విన్స్ టవర్స్ పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా దుమ్ము, ధూళి ఆవవరించింది. కూల్చివేతకు ముందు అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు చేపట్టారు. కూల్చివేతకు కొన్ని నిమిషాల ముందు సైరన్ మోగించారు. అయితే కూల్చివేత ప్రక్రియ సందర్భంగా సమీపంలోని భవనాలకు ఏదైనా డ్యామేజ్ జరిగిందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఆ ప్రాంతంలో ఆవరించిన దుమ్ము తొలగడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక, భవనాల కూల్చివేత ద్వారా దాదాపు 55,000 టన్నుల శిథిలాలు ఉత్పన్నమవుతాయని ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులు ముందుగా చెప్పారు. చెత్తను తొలగించేందుకు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. వ్యర్థాలను నిర్దేశిత ప్రాంతాల్లో డంప్‌ చేయనున్నారు.

ఇక, ఎమరాల్డ్ కోర్టు సొసైటీ ఆవరణలో నిబంధనలకు విరుద్ధంగా ట్విన్ టవర్స్ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించడంతో సుప్రీంకోర్టు వాటి కూల్చివేతకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ట్విన్ టవర్స్‌ను నేలమట్టం చేసేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించారు. రెండు భవనాలో 7000 రంధ్రాలు చేసి అందులో పేలుడు పదార్థాలు నింపారు. 20 వేల సర్క్యూట్లను ఏర్పాటు చేశారు. 100 మీటర్ల దూరంలో ఉన్న బటన్ నొక్కడం ద్వారా భవనాలు నేలమట్టం అయ్యాయి. నోయిడా అథారిటీ మార్గదర్శకత్వంలో సూపర్‌టెక్‌ సంస్థ తన సొంత ఖర్చుతో భవనాలను కూల్చివేసింది.

ఇక, ఈ ట్విన్ టవర్స్ నోయిడాలోని సెక్టార్ 93A వద్ద ఉన్నాయి. ఒక భవనం 103 మీటర్ల ఎత్తులో ఉండగా, మరొకటి 97 మీటర్ల ఎత్తులో ఉంది. వాటర్‌ఫాల్ ఇంప్లోషన్ టెక్నిక్ ద్వారా కొన్ని సెకన్లలోనే కూల్చివేత ప్రక్రియను పూర్తి చేశారు. ట్విన్ టవర్స్ కూల్చివేత నేపథ్యంలో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు ఆంక్షలు అమలు చేశారు. ఈ ట్విన్ టవర్స్‌కు సమీపంలో ఉన్న భవనాల్లోకి.. దుమ్ము చొరబడకుండా జియో టెక్స్‌టైల్ కవరింగ్ ఉపయోగించారు. జంట టవర్లకు సమీపంలోని ఎమెరాల్డ్‌ కోర్టు, ఏటీఎస్‌ విలేజ్‌ సొసైటీలలోని దాదాపు 5,000 మందిని అక్కడి నుంచి తరలించారు. రెండు సొసైటీలలో వంటగ్యాస్, విద్యుత్ సరఫరా కూడా నిలిపివేసినట్టుగా అధికారులు తెలిపారు. నివాసితులతో పాటు వారి వాహనాలు, పెంపుడు జంతువులను కూడా బయటకు తరలించినట్లు చెప్పారు. టవర్స్ కూల్చివేత తర్వాత కాలుష్య స్థాయిలను పర్యవేక్షించేందుకు నోయిడాలోని సెక్టార్ 93Aలోని కూల్చివేత స్థలంలో ప్రత్యేక డస్ట్ మెషీన్‌ను ఏర్పాటు చేశారు. 

 

ట్విన్ టవర్స్‌కు సమీపంలోని హౌసింగ్ సొసైటీల రోడ్డులపై నుంచి వీధి కుక్కలను పలు ఎన్జీవో సంస్థలు దూరంగా తరలించాయి. ట్విన్ టవర్స్ కూల్చివేత ప్రక్రియ ప్రారంభించడానికి 15 నిమిషాల ముందు.. నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. నోయిడా ఎక్స్‌ప్రెస్ వే దుమ్ము తగ్గిన తర్వాత తిరిగి మూడు గంటల సమయంలో రాకపోకలకు అనుమతించనున్నారు. ప్రస్తుతం పేలుడు పూర్తికావడంతో.. సెఫ్టీ క్లియరెన్స్ అనంతరం మెరాల్డ్‌ కోర్టు, ఏటీఎస్‌ విలేజ్‌ సొసైటీలలోని నివాసితులను తిరిగి వారి ఇళ్లలోకి అనుమతించనున్నారు. 

 

ఇక, ఈ కూల్చివేత సందర్భంగా ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే దానిని ఎదుర్కొనేందుకు వీలుగా.. ఆంబులెన్స్‌లు, ఫైర్‌ ఇంజన్లు సిద్ధంగా ఉంచారు. అలాగే ఫెలిక్స్ ఆస్పత్రిలో 50 బెడ్లను సిద్ధంగా ఉంచారు. ఎన్డీఆర్ఎఫ్, ఉత్తరప్రదేశ్ ప్రావిన్షియల్ ఆర్మ్‌డ్ కాన్‌స్టాబులరీ సిబ్బందిని క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచారు. ఇక, ట్విన్ టవర్స్ కూల్చివేత దృశ్యాలను అక్కడికి కొద్ది దూరంలో బిల్డింగ్‌ల నుంచి ప్రజలు వీక్షించారు.  

ఇక, నోయిడాలోని సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్ట్ హౌసింగ్ సొసైటీలో ఈ రెండు టవర్లు ఉన్నాయి. ఈ ట్వీన్ టవర్స్‌ను నిర్మించాలని 2004లో ప్రతిపాదించారు. ఇవి సెక్టార్ 93A ప్లాట్ నంబర్ 4లో భాగంగా ఉన్నాయి. అయితే వీటిని నిబంధలనకు విరుద్దంగా నిర్మించారని సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్టు సోసైటీ వాళ్లు 2012లో కోర్టును ఆశ్రయించారు.  దీంతో ట్విన్ టవర్సర్ నిర్మాణం అక్రమమేనని తేల్చిన అలహాబాద్‌ హైకోర్టు.. రెండు భవనాలను కూల్చివేసి, అపార్ట్‌మెంట్ కొనుగోలుదారులకు డబ్బు వాపసు ఇచ్చేయాలని 2014లో తీర్పునిచ్చింది. అయితే ఆ తర్వాత ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. చివరకు అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు.. ట్విన్ టవర్స్‌ను కూల్చేయాల్సిందేనని 2021 ఆగస్టు 31న తీర్పునిచ్చింది. అయితే సాంకేతిక కారణాల వల్ల ట్విన్ టవర్స్ కూల్చివేతకు ఏడాది సమయం పట్టింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios