ఓ మైనర్ బాలికను మాయమాటలు చెప్పి నమ్మించి... కిడ్నాప్ చేశారు. అనంతరం ఓ చీకటి గదిలో బంధించి... 51 రోజలపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కామాంధుల చెర నుంచి బయటపడిన ఆ చిన్నారి తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బాలిక తండ్రి నొయిడా సమీపంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. దీంతో.. బాలిక చదువుకోలేదు. ఇంటి దగ్గరే ఉంటూ... కుటుంబానికి సహాయపడేది. చిన్న చిన్నపనులు చేసి డబ్బులు సంపాదించేది.   రెండు నెలల క్రితం వారి ఇంటికి సమీపంలో మధ్యప్రదేశ్‌కు చెందిన చోటు, యూపీకి చెందిన సురాజ్‌లు అనే యువకులు బ్యాచిలర్‌గా వచ్చి చేరారు. మొదట బాలికతో స్నేహం ఏర్పరచుకున్న దుండగులు వారం రోజుల తర్వాత ఆమెను కిడ్నాప్‌ చేసి ఓ గదిలో బంధించారు.

అక్కడ ఆదిత్య అనే మరో వ్యక్తితో కలిసి 51 రోజుల పాటు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. ఏప్రిల్‌ 22న బాలిక ఆ గది నుంచి తప్పించుకొని ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది.

 దీంతో బాలిక తండ్రి నొయిడాలోని మూడో పేస్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, త్వరలోనే ఆ ముగ్గురు దుండగులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.