నోయిడాకు చెందిన ఓ వ్యక్తి అకౌంట్‌లో ఒక్క పైసా తక్కువగా ఉండటంతో సైబర్ నేరస్తుల మోసం నుంచి బయటపడ్డాడు. సైబర్ మోసగాళ్లు రూ. 10 వేలు బ్యాంకు అకౌంట్ నుంచి దొంగిలించాలని భావించారు. కానీ, అకౌంట్‌లో కేవలం రూ. 9999.99 మాత్రమే ఉండటంతో వారి పన్నాగం పని చేయలేదు.

నోయిడా: టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదో అంతే వేగంగా మోసాలూ వెంట వస్తున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ చెల్లింపులు పెరిగినప్పటి నుంచి సైబర్ కేటుగాళ్లు పంజా విసురుతున్నారు. చూస్తుండగానే బ్యాంకు ఖాతాలో సొమ్ము హాం ఫట్ చేస్తున్నారు. క్షణాల్లో జరిగిపోతున్న ఈ మోసాల నుంచి జాగ్రత్తగా ఉండటానికి ఖాతాదారులు చాలా విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా ఒక్కోసారి ఆర్థిక మోసానికి గురి కాక తప్పడం లేదు. కానీ, కొన్నిసార్లు అదృష్టం కూడా సైబర్ మోసాలను కాపాడుతాయని నోయిడా వ్యక్తికి జరిగిన ఘటన వెల్లడిస్తుంది.

నోయిడా వ్యక్తికి చెందిన అకౌంట్‌పై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. ఆయన అకౌంట్ నుంచి రూ. 10 వేలు మాయం చేద్దామని ప్రయత్నించారు. ఆ నేరానికి ప్రాసెస్ ప్రారంభించారు. కానీ, ఆ వ్యక్తి అకౌంట్‌లో పదివేలకు ఒక్క పైసా తక్కువగా ఉన్నది. అంటే.. ఆయన అకౌంట్‌లో రూ. 9999.99లు ఉన్నాయి. దీంతో ఆ సైబర్ నేరగాళ్లు భంగపడక తప్పలేదు. ఆ ట్రాన్సాక్షన్ విఫలమైంది.

ఇండియా టుడే కథనం ప్రకారం, గ్రేటర్ నోయిడాలోని దారిన్ గ్రామానికి చెందిన సునీల్ కుమార్‌కు ఈ ఘటన ఎదురైంది. ఈ ఘటన జూన్ 2న జరిగింది.

సునీల్ కుమార్ తమ బంధువులకు రూ. 20 వేలు పంపాలని అనుకున్నాడు. కానీ, అకౌంట్ నంబర్ తప్పుగా టైప్ చేసి ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఆయన రియలైజ్ అయ్యాడు. వెంటనే ఆయన తన బ్యాంకుకు ఇన్ఫామ్ చేశాడు. కానీ, ఆ డబ్బు వెనక్కి రావడానికి ఎలాంటి సహాయం లభించలేదు. దీంతో ఆయన అదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. ఆ బ్యాంకు అధికారులను ట్యాగ్ చేస్తూ ఆ ట్వీట్ చేశాడు.

అయితే, అధికారుల నుంచి స్పందన రాలేదు. కానీ, ఆ బ్యాంకు అధికారికి ట్యాగ్ చేస్తూ పోస్టు చేసిన ట్వీట్‌ను సైబర్ నేరగాళ్లు చూశారు. ఇదే అదునుగా వారు యాక్టివ్ అయ్యారు. ఆయనను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారు. ఆయన ఫోన్‌లో ఓ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని తప్పుదారి పట్టించారు. అనంతరం, వారు సులువుగా సునీల్ కుమార్ బ్యాంకు వివరాలు రాబట్టుకున్నారు. ఈ వివరాల ఆధారంగా వారు రూ. 2000ల డబ్బులను పంపించుకోవాలని భావించారు. ప్రాసెస్ మొదలు పెట్టారు. కానీ, అది సాధ్యం కాలేదు. దీంతో వారు రూ. 10 వేలు తస్కరించడానికి ప్రయత్నించారు. కానీ, అందులో రూ. 10 వేలకు ఒక్క పైసా తక్కువగా ఉంది. దాంతో వారు చేసిన ప్రయత్నం మరోసారి విఫలమైంది. రూ. 10 వేల అక్రమంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని విఫలం కావడంతో సునీల్ కుమార్‌కు అలర్ట్ వెళ్లింది. తాను సైబర్ క్రైమ్ నేరస్తులకు బాధితుడిగా మారానని తెలుసుకోగానే నోయిడాలోని సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేశారు.