నోయిడా: కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత వింత సంఘటనలు పలు జరుగుతున్నాయి. తాజాగా, బస్సు డ్రైవర్ హెల్మెట్ ధరించలేదని బస్సు యజమానికి రూ. 500 జరిమానా విధించారు. నోయిడాలో ఈ సంఘటన జరిగింది. జరిమానా వివరాలను ట్రాఫిక్ పోలీసులు ఆన్ లైన్ లో పెట్టినట్లు నిరంకార్ సింగ్ చెప్పారు. 

తమ ఉద్యోగుల్లో ఒకరు చెక్ చేసి తనకు ఆ విషయం చెప్పారని, ట్రాఫిల్ పోలీసుల నిర్ణయాన్ని తాను కోర్టులో సవాల్ చేస్తానని ఆయన చెబుతున్నారు. తన కుమారుడు రవాణా వ్యాపారాన్ని చూసుకుంటాడని, తమకు 40 నుంచి 50 బస్సులున్నాయని చెప్పారు. తమ బస్సులను నోయిడా, గ్రేటర్ నోయిడాల్లోని పాఠశాలలు ప్రైవేట్ కంపెనీలు వినియోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సంఘటన రవాణా శాఖ దారుణ పరిస్థితిని తెలియజేస్తోందని ఆయన అన్నారు. బాధ్యతాయుతమైన శాఖ పనితీరును ఈ చర్య ప్రశ్నిస్తోందని, ప్రతి రోజూ జారీ చేసే వందలాది చలాన్ల విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. 

తమ బస్సు డ్రైవర్ కు జరిమానా విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తానని, అవసరమైతే కోర్టు తలుపులు తడుతానని ఆయన అన్నారు. ఆ విషయాన్ని పరిశీలించి తప్పులుంటే సరిదిద్దుకుంటామని సంబంధిత అధికారులు అంటున్నారు.