Noida Airport: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని జెవార్ ప్రాంతంలో నూత‌న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించనున్న విష‌యం తెలిసిందే.. అయితే.. ఈ  అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించే కాంట్రాక్ట్‌ను టాటా గ్రూప్‌కు చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్‌స్ట్రక్షన్ విభాగం టాటా ప్రాజెక్ట్స్ చేజిక్కించుకుంది. 

Noida Airport: దేశంలోని ప్రఖ్యాత కంపెనీలలో ఒకటైన టాటా గ్రూప్ కీల‌క ప్రాజెక్టును నిర్మించ‌నున్నది. దేశంలోనే అతిపెద్దగా నిర్మించద‌లిచిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ కాంట్రాక్టును టాటా గ్రూప్‌కు చెందిన టాటా ప్రాజెక్ట్స్ దక్కించుకుంది. లార్సెన్ & టూబ్రో, సైరస్ మిస్త్రీ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కూడా ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడానికి పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు ఈ ప్రాజెక్టు ద‌క్కించుకోవ‌డంలో టాటా గ్రూప్ విజయం సాధించింది.

టాటా గ్రూప్‌కు చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ సంస్థ అయిన టాటా ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఈ మెగా ప్రాజెక్ట్‌ను నిర్మించ‌నున్న‌ది. యమునా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (YIAPL) ఈ పని కోసం టాటా ప్రాజెక్ట్‌లను ఎంపిక చేసింది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు వివరించారు. 

నోయిడా విమానాశ్రయం యొక్క మొదటి దశ రాబోయే రెండేళ్లలో సిద్ధమవుతుందని టాటా గ్రూప్స్ అంచనా వేస్తుంది. టాటా ప్రాజెక్ట్స్ చేపట్టిన రెండవ విమానాశ్రయ ప్రాజెక్ట్ ఇది. మొదటిది ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) విమానాశ్రయ టెర్మినల్ ను టాటా ప్రాజెక్ట్స్ నిర్మించిన విషయం తెలిసిందే.

గత ఏడాది నవంబర్ 25న జేవార్‌లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. యూపీలోని యోగి ప్రభుత్వం గ్రేటర్ నోయిడాలో ప్రతిపాదిత జేవార్ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 5,845 హెక్టార్ల భూమిని ఇచ్చింది. 2024 నాటికి ఈ విమానాశ్రయాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జెవార్ విమానాశ్రయం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద విమానాశ్రయం కానుంది.

ఈ సంద‌ర్భంగా టాటా ప్రాజెక్ట్స్ ప్ర‌తినిధి వినాయక్ మాట్లాడుతూ.. “Jewar వద్ద గ్రీన్‌ఫీల్డ్ నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం కోసం EPC పనిని అప్పగించినందుకు మాకు గర్వంగా ఉంది. టాటా ప్రాజెక్ట్స్ భారతదేశం యొక్క అత్యంత ఆధునాతన, పర్యావరణ అనుకూల విమానాశ్రయాన్ని సమయానికి అందించడానికి YIAPLతో కలిసి పని చేస్తున్నాం. నిర్మాణంలో నాణ్యత, భద్రత, స్థిరత్వం యొక్క ప్రమాణాలకు అనుగుణంగా నూత‌న‌ సాంకేతిక ప‌రిజ్జానాన్ని ఉప‌యోగిస్తామ‌ని తెలిపారు.

ఈ ఒప్పందంలో భాగంగా.. విమానాశ్రయంలో టెర్మినల్, రన్‌వే, ఎయిర్‌సైడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, యుటిలిటీస్, ల్యాండ్‌సైడ్ సౌకర్యాలు, ఇతర అనుబంధ భవనాలను టాటా ప్రాజెక్ట్స్ నిర్మిస్తుందని యమునా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐఎపిఎల్) ఓ ప్రకటనలో తెలిపింది.

2024 నాటికి అందుబాటులోకి

నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తయ్యాక ఇండియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ కానున్న‌ది. మొత్తం 1,334 హెక్టార్లలో నిర్మించ‌నున్న‌ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్ర‌యంలో మొదటి దశలో రూ. 5,700 కోట్ల పెట్టుబడితో సింగిల్ రన్‌వే కార్యకలాపాలను చేప‌ట్ట‌నున్నారు. ఈ విమానాశ్ర‌యంలో సంవత్సరానికి 12 మిలియన్ల ప్రయాణీకులు ప్రయాణించే సామర్థ్యంతో రూపొందిస్తున్నారు. భార‌త్ లోనే అతిపెద్ద‌ విమానాశ్రయం 2024 నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. 

నోయిడా విమానాశ్రయం ప్రత్యేకత‌లు

> ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని జెవార్‌లో నిర్మించబడుతుంది.

> విమానాశ్రయం మొదటి దశలో రెండు రన్‌వేలను, రెండవ దశలో ఐదు రన్‌వేలుగా మార్చ‌నున్నారు. 

> రెండు రన్‌వేలతో కూడిన ఈ విమానాశ్రయంలో ఏడాదికి 7 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది.

> జేవార్ విమానాశ్రయానికి దాదాపు రూ.30,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

> తూర్పు ఉత్తర భార‌త‌దేశ రాష్ట్రాలు ప్రపంచదేశాల‌తో అనుసంధానించడం సులభం అవుతుంది.

> విమానాశ్రయం కోసం 3,300 ఎకరాల భూమిని సేకరించారు.