కరోనా వల్ల భారతదేశంలో ఎక్కువగా నష్టపోయిన రాష్ట్రం మహారాష్ట్ర. తొలి దశలోనే అక్కడ కోవిడ్ మారణహోమం సృష్టించింది. ఆ తర్వాత పరిస్ధితి కుదుటపడుతుంది అనుకున్న సమయంలో సెకండ్ వేవ్ విరుచుకుపడింది. బెడ్లు లేక, ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో మరాఠీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోజుకు 50 వేల పైచిలుకు కేసులతో మహారాష్ట్ర తిరిగి కోలుకుంటుందా అన్నంత చర్చ జరిగింది. అయితే ప్రభుత్వం లాక్‌డౌన్, కర్ఫ్యూ వంటి కఠిన ఆంక్షలతో వైరస్‌ను కట్టడి చేయగలిగింది. ఈ చర్యలు సత్ఫలితాలను ఇవ్వడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అన్‌లాక్‌కు సిద్ధమైంది.

ఈ క్రమంలో లాక్‌డౌన్, కరోనా విజృంభణతో నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లు త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో సినిమా/టెలివిజన్‌ షూటింగ్‌లను తిరిగి ప్రారంభించే విషయమై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆదివారం చిత్ర పరిశ్రమ, టెలివిజన్‌ పరిశ్రమవర్గాలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైరస్ నియంత్రణలో ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా ఉద్ధవ్‌ విజ్ఞప్తి చేశారు. కేసులు పూర్తిగా తగ్గి, పరిస్థితి అదుపులో ఉన్నప్పుడు వెంటనే షూటింగ్‌లకు అనుమతి ఇస్తామని ఈ సందర్భంగా ఠాక్రే ప్రకటించారు.   

Also Read:గుడ్‌న్యూస్:ఇండియాలో మరింత తగ్గిన కరోనా కేసులు, మరణాలు

కాగా, మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య ఆధారంగా ఆయా ప్రాంతాల్ని స్థాయిలవారీగా విభజించి అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించింది. పాజిటివిటీ రేటు ఐదు శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ని పూర్తిగా ఎత్తివేసింది. అక్కడ థియేటర్లలో సినిమా ప్రదర్శనలకీ సైతం అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలో చివరి దశలో ఉన్న సినిమాల్ని పూర్తి చేయడం కోసం ఈ నెల 7 నుంచే బాలీవుడ్‌ వర్గాలు షూటింగ్‌లకు సిద్ధం అవుతున్నాయి. అయితే నిబంధనల దృష్ట్యా ఉన్నపళంగా చిత్రీకరణలు ప్రారంభం కాలేవని, నిర్మాతలు తమ చిత్ర బృందాలకి టీకాలు వేయించడంపై దృష్టిపెట్టారని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.