కోవిడ్ వ్యాక్సిన్ (covid vaccine) తీసుకోని తమ ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు చెల్లించబోయమని మున్సిపాలిటీ అధికారులు ప్రకటించారు. ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకోని తమ ఉద్యోగులకు జీతాలు (salary) చెల్లించకూడదని నిర్ణయించారు.
ఇండియాలో కోవిడ్ వ్యాక్సినేషన్ (covid vaccination) ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతుంది. అయితే ఇప్పటికి కొందరు వ్యాకినేషన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో పలుచోట్ల అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా మహారాష్ట్రలోని థానే మున్సిపల్ కార్పొరేషన్ (Thane Municipal Corporation) సంచలన నిర్ణయం తీసుకుంది. టీకా తీసుకోని తమ ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు (salary) చెల్లించబోయమని ప్రకటించింది. ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకోని తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించకూడదని మున్సిపాలిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సీనియర్ అధికారులతో సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో థానే మున్సిపల్ కమిషనర్ డాక్టర్ విపిన్ శర్మ, థానే మేయర్ నరేష్ మస్కే కూడా పాల్గొన్నారు.
నిర్ణీత వ్యవధిలోపు రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులకు కూడా జీతాలు అందవని థానే మున్సిపల్ కార్పొరేషన్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఉద్యోగులందరూ తమ టీకా సర్టిఫికేట్‌లను సంబంధిత కార్యాలయాల్లో సమర్పించడాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోగా నగరంలో 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా సమావేశం అనంతరం మేయర్ విలేకరులతో చెప్పారు.
Also read: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు: కేరళలో భారీగా పెరిగిన కరోనా మృతులు
టీకా లక్ష్యాన్ని సాధించేందుకు మంగళవారం భారీ కార్యక్రమం చేపట్టున్నట్టుగా మేయర్ వెల్లడించారు. ఈ లక్ష్య సాధించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా హర్ ఘర్ దస్తక్ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. ఆరోగ్య ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు, నర్సులు ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ తీసుకోని వారి వివరాలను సేకరిస్తారని.. అలాంటి వ్యాక్సిన్ అందజేస్తామని చెప్పారు. ఇందుకోసం మొత్తం 167 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి డోస్ తీసుకున్న వారు.. వారికి నిర్దేశించిన సమయంలో రెండో డోస్ తీసుకోవాలని కోరారు.
ఇదిలా ఉంటే విద్యార్థులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి అవగాహన కల్పించడానికి వివిధ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులను నియమించినట్టుగా థానే మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. వ్యాక్సిన్ అవసరం గురించి తాము తెలుసుకున్న విషయాలను విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తెలిపేలా ప్రణాళికలు రూపొందించినట్టుగా పేర్కొంది.
నగరంలో కోవిడ్-19 కేసులు తగ్గుముఖం మంచి పరిణామం అని మేయర్ అన్నారు. అయితే ఇన్‌ఫెక్షన్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఉందన్నారు. మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఒక్కటే ఇందుకు మార్గమని చెప్పారు. ఇక, ఆదివారం థానే జిల్లాలో కొత్తగా 118 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,66,749కి చేరింది. తాజాగా ఒకరు మరణించడంతో.. మృతుల సంఖ్య 11,543కి చేరింది.
