Asianet News TeluguAsianet News Telugu

పాక్‌తో చర్చల్లేవ్... ఉగ్రవాదాన్ని మోడీ స‌ర్కారు స‌హించ‌దు: హోం మంత్రి అమిత్ షా

Home Minister Amit Shah: పాక్‌తో చర్చలు లేవు.. ఉగ్రవాదాన్ని మోడీ ప్రభుత్వం సహించదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ముఫ్తీ అండ్ కంపెనీ, అబ్దుల్లా, ఆయ‌న‌ కొడుకులు, కాంగ్రెస్ జమ్మూకశ్మీర్ ప్రజల సంక్షేమానికి చేసిందేమీ లేదని విమ‌ర్శించారు. 
 

No talks with Pakistan... Modi government will not tolerate terrorism: Home Minister Amit Shah
Author
First Published Oct 5, 2022, 4:48 PM IST

Jammu Kashmir: పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు జరపడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం అన్నారు. మోడీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుండి ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టి, దేశంలో అత్యంత ప్రశాంతమైన ప్రదేశంగా మారుస్తుందని నొక్కి చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం ఉగ్ర‌వాదాన్ని స‌హించ‌బోమ‌ని అన్నారు. బారుముల్లాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ.. 1990ల నుండి జ‌మ్మూకాశ్మీర్ లో 42,000 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదం ఎప్పుడైనా ఎవరికైనా ప్రయోజనం చేకూర్చిందా? అని ప్రశ్నించారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి జమ్మూ కాశ్మీర్‌లో ఎక్కువ సమయం పాలించిన పార్టీల‌పై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహ‌బూబా ముఫ్తీ, (పీడీపీ), నెహ్రూ-గాంధీ (కాంగ్రెస్) కుటుంబాలపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. వారి పాల‌న‌లో  జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చెందలేదని అన్నారు. 

పాకిస్థాన్‌తో మాట్లాడాలని కొందరు అంటున్నారు. పాకిస్థాన్‌తో ఎందుకు మాట్లాడాలి? మేము మాట్లాడము. బారాముల్లా ప్రజలతో మాట్లాడతాం, కాశ్మీర్ ప్రజలతో మాట్లాడతాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నాయ‌కత్వంలోని ప్ర‌భుత్వం ఉగ్రవాదాన్ని సహించదనీ, దానిని అంతం చేసి తుడిచిపెట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. జమ్మూకశ్మీర్‌ను దేశంలోనే అత్యంత శాంతియుత ప్రాంతంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామని చెప్పారు. కొందరు తరచూ పాకిస్థాన్ గురించి మాట్లాడుతారని, అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ఎన్ని గ్రామాలకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవాలని షా అన్నారు. గత మూడేళ్లలో కాశ్మీర్‌లోని అన్ని గ్రామాలకు విద్యుత్ కనెక్షన్ ఉండేలా చూసుకున్నామ‌ని తెలిపారు. వరుసగా రెండో రోజు మూడు రాజకీయ కుటుంబాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన హోంమంత్రి, వారి పేర్లను కూడా తీసుకుంటూ.. వారి పాలనలో పాలనా లోపం, అవినీతి, అభివృద్ధి లేమితో నిండిపోయిందని ఆరోపించారు. ముఫ్తీ అండ్ కంపెనీ, అబ్దుల్లా, ఆయ‌న‌ కొడుకులు, కాంగ్రెస్ జమ్మూకశ్మీర్ ప్రజల సంక్షేమానికి చేసిందేమీ లేదని అన్నారు.

ముఫ్తీ అండ్ కో, అబ్దుల్లా అండ్ సన్స్ కశ్మీర్‌ను 'టెర్రరిస్ట్ స్పాట్'గా మార్చారనీ, మోడీజీ 'టూరిస్ట్ హాట్‌స్పాట్'గా మార్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌లో జరిగిన తొలి బహిరంగ సభ అయిన బారాముల్లా పట్టణంలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి షా ప్రసంగిస్తూ పై వ్యాఖ్య‌లు చేశారు. 1947లో గిరిజన ఆక్రమణదారులతో పోరాడి అమరులైన మట్టి పుత్రుడు మక్బూల్ షేర్వానీకి నివాళులర్పిస్తూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. స్థానిక మసీదు నుండి వస్తున్న 'అజాన్' (నమాజ్ కోసం పిలుపు) వినగానే షా తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపారు. ఆజాన్ ముగిసిన తర్వాత ఆయన తన ప్రసంగాన్ని పునఃప్రారంభించారు. త‌న ప‌ర్య‌ట‌న‌కు ముందు జ‌మ్మూకాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి, పీడీపీ నాయ‌కురాలు మెహ‌బూబా ముఫ్తీ జ‌మ్మూకాశ్మీర్ కోసం ఏమీ చేశారో చెప్పాల‌ని ఒక ట్వీట్ లో కోరార‌ని పేర్కొన్న ఆయ‌న‌.. "మెహబూబాజీ కళ్ళు పెద్దవి చేసి చూడండి.. ఫరూక్ సాహిబ్, మేము ఏమి చేసామో.. మీరు ఏమి చేసారో చూడండని" పేర్కొన్నారు. “మీ పాలనలో 87 మంది అసెంబ్లీ సభ్యులు, 6 మంది పార్లమెంట్ సభ్యులు, మూడు కుటుంబాలు ఉండేవి. ప్రజాస్వామ్యాన్ని పంచాయతీ, బ్లాక్, జిల్లా స్థాయిలకు మోడీ తీసుకెళ్లారు. నేడు ఈ సంస్థల్లో 30,000 మందికి పైగా ప్రజా ప్రతినిధులు ఉన్నారు” అని ఆయన నొక్కి చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios