ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మంగళవారం ఆరుగంటల పాటు ఎయిర్ పోర్ట్ ని మూసివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రధాన, సెకండరీ రన్‌వేల మరమ్మతుల కారణంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు. దీనివల్ల వందలాది మంది ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యే అవకాశముంది. 

అక్టోబరు, ఫిబ్రవరి-మార్చి నెలల్లో రెండు విడతలుగా ఈ రన్‌వే మరమ్మతులు చేపట్టనున్నట్లు విమానాశ్రయ అధికారులు ముందుగానే ప్రకటించారు. దీనివల్ల రోజుకు 300 విమానాల రాకపోకలపై ప్రభావం పడనుంది. ముంబయి విమానాశ్రయంలో మరమ్మతుల కారణంగా రీ షెడ్యూల్‌, రద్దు చేసిన విమాన సర్వీసుల వివరాలకు తమ వెబ్‌సైట్‌ సందర్శించాలని ఎయిర్‌ ఇండియా సంస్థ సోమవారం ట్వీట్‌ చేసింది.

అక్టోబరు 23న విమానాశ్రయంలో ఆరు గంటల పాటూ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ముంబయి ఎయిర్‌పోర్టు ఈ నెల 4నే వెల్లడించింది. రెండో విడత మరమ్మతులను వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 30 వరకూ (మార్చి 21 మినహా) చేపడతామని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఈ మరమ్మతులు మంగళ, గురు, శనివారాల్లోనే చేపడతామని తెలిపారు.

ముంబయి విమానాశ్రయం రోజుకు వెయ్యి వరకూ విమాన సర్వీసులను ప్రయాణికులకు అందిస్తోంది. గంటకు 50 విమానాల వరకూ ల్యాండ్‌ అయ్యే సామర్థ్యం ప్రధాన రన్‌వేకు ఉండగా.. సెకండరీ రన్‌వే గంటకు 35 విమానాలు రాకపోకలను నిర్వహించగలదు.