అమరావతి:  ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ స్పష్టం చేశారు.మంగళవారంనాడు లోక్‌సభలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.  టీడీపీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.

14వ  ఆర్ధిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికి కూడ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలున్నాయని ఆయన చెప్పారు. ఈ సమస్యలను తెలుగు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

మరికొన్ని విభజన హమీలు వివిద దశల్లో ఉన్నాయని ఆయన వివరించారు. ప్రాజెక్టులు, విద్యాసంస్థల నిర్మాణం సుదీర్ఘకాలం పట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు.విభజన హమీల అమలుకు వివిధ శాఖలతో సమీక్షలు నిర్వహిస్తున్నట్టుగా ఆయన హామీ ఇచ్చారు.విభజన చట్టం అమలు పురోగతిని హోంశాఖ సమీక్షిస్తోందని ఆయన వివరించారు.

 

 

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ప్రత్యేక హోదా అంశం ఏపీ రాష్ట్రంలో ఎన్నికల్లో  ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది.