రెండు రకాల కరోనా వ్యాక్సిన్ లలో తమకు ఇదే కావాలని ఎంచుకునే అవకాశం ప్రజలకు లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తేల్చి చెప్పింది. దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జనవరి 16న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అత్యవసర వినియోగం కింద అనుమతి పొందిన కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

అయితే, వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే ఆప్షన్ ప్రజలకు ప్రస్తుతానికి ఉండబోదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అనేక దేశాల్లో ఒకటి కంటే ఎక్కువ టీకాలు సరఫరా అవుతున్నప్పటికీ ఎక్కడా ప్రజలకు ఇలాంటి ఎంపిక స్వేచ్ఛను ఇవ్వలేదని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ వెల్లడించారు.

రెండు డోసులను 28 రోజుల వ్యవధిలో తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల తర్వాతే వాటి ప్రభావం ప్రారంభమవుతుందని తెలిపారు. అప్పటివరకు కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇక ఈ రెండు వ్యాక్సిన్ లు వేల మందిపై పరీక్షించారని, అవి సురక్షితమైనవేనని నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్ స్పష్టం చేశారు. బారతీయ వ్యాక్సిన్ లన్నీ సురక్షితమని, సమర్థవంతంగా పనిచేస్తాయని, ప్రజలు వాటిని నిస్సంకోచంగా పొందవచ్చని సీరం ఇన్ స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కొవిషీల్డ్ టీకాలు దేశవ్యాప్తంగా నిర్ధేశించిన ప్రాంతాలకు తరలించగా, కొవాగ్జిన్ టీకాల రవాణా ప్రారంభమైంది.