దేశ వనరులు ఎవరికీ చేరుతున్నాయో తెలియడం లేదు.. అందుకే దేశవ్యాప్త ఎన్ఆర్సీ అవసరం - హిమంత బిశ్వ శర్మ
దేశ వనరులు మన దేశ పౌరుడికి వెళ్తున్నాయో లేక పౌరుడేతరుడికి వెళ్తున్నాయో తెలియడం లేదని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. అందుకే దేశ వ్యాప్తంగా ఎన్ ఆర్సీ అవసరమని తెలిపారు. కర్ణాటక బీజేపీ తన మేనిఫెస్టోలో ఈ ఎన్ఆర్సీ అంశాన్ని చేర్చడాన్ని ఆయన స్వాగతించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మంగళవారం విడుదల చేసిన మేనిఫెస్టోను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రశంసించారు. అందులో అనేక విషయాలతో పాటు రాష్ట్రంలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) అమలు చేస్తామని చెప్పడాన్ని ఆయన స్వాగతించారు. ఎన్ఆర్సీని కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆయన అన్నారు.
హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే కాల్చి చంపేస్తాం - కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం యూనివర్సల్ బెనిఫిట్స్ గా ప్రకటించిన ఆధార్ కార్డును ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆధార్ కార్డు పౌరసత్వానికి రుజువు కాదని చెప్పారు. ‘‘దేశవ్యాప్త ఎన్ఆర్సీ ప్రస్తుత అవసరం. నేటికీ మన దగ్గర నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ లేదు. ఆధార్ పౌరసత్వానికి సూచిక కాదు. దేశ వనరులు పౌరుడికి వెళ్తున్నాయో లేక పౌరేతరుడికే వెళ్తున్నాయో తెలియదు. కర్ణాటక బీజేపీ ఎన్ఆర్సీని ప్రకటించడాన్నినేను స్వాగతిస్తున్నాను’’ అని తెలిపారు.
కర్ణాటకలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ప్రజలకు అనేక హామీలను ఇస్తోంది. ఈ క్రమంలో సోమవారం మేనిఫెస్టో విడుదల చేసింది. అందులో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అమలుతో పాటు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వంటగ్యాస్ సిలిండర్లు అందిస్తామని పేర్కొంది. అలాగే ఇంటింటికి 5 కిలోల బియ్యం, నందిని పాలు ఉచితంగా అందిస్తామని తెలిపింది. దీంతో పాటు రాష్ట్రంలో అక్రమంగా ఉన్న వలసదారులందరినీ త్వరతగతిన బహిష్కరించేందుకు ఎన్ఆర్సీని అమలు చేస్తామని హామీ ఇచ్చింది.
బ్రేకింగ్ : తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా హతం.. ప్రత్యర్థి ముఠా దాడి చేయడంతో ఘటన
2021లో జరిగిన అస్సాం అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా కర్ణాటక ఎన్నికలలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ తన మ్యానిఫెస్టోలో ఎన్‌ఆర్సీతో పాటు పౌరసత్వ (సవరణ) చట్టానికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఎన్ఆర్సీని 2019 లో పార్లమెంటు ఆమోదించింది. అయితే పలు కారణాల వల్ల అది ఇంకా అమల్లోకి రాలేదు.