భారత సరిహద్దుల్లోకి ఎవరూ ప్రవేశించలేదని అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. గాల్వాన్‌లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆయన ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఆర్మీకి చెందిన ఏ ఒక్క పోస్టునూ చైనా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకునే ప్రసక్తే లేదన్న ప్రధాని.. సైనికులకు అత్యాధునిక ఆయుధాలను అందిస్తామని తెలిపారు.

చైనా తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడిన మోడీ.. భారత్ శాంతి కోరుకుంటోందని, కానీ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కాగా.. ఈ అఖిలపక్ష సమావేశంలో 20 మంది పార్టీ నేతలు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తరపున రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ పాల్గొన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

ఘర్షణలకు ముందు, తర్వాత పరిస్థితిని ఆయన వివిధ పార్టీల నేతలకు వివరించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ అఖిలపక్ష సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

టెలికాం, రైల్వే, విమానయాన రంగాల్లోకి చైనాను అనుమతించొద్దని టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. చైనీయులు ప్రవేశించడానికి తాము ఒప్పుకోమని ఆమె స్పష్టం చేశారు.

అఖిలపక్ష సమావేశం దేశానికి మంచి సందేశమని, మన జవాన్ల వెనుక మనమందరం ఉన్నామనే సంకేతం వెళ్తుందని మమత వెల్లడించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్ధతు ఉంటుందన్నారు.

చైనా ప్రజాస్వామ్య దేశం కాదని.. ఏదనుకుంటే అది చేస్తుందని, మనం కలిసి పనిచేస్తే ఇండియా గెలుస్తుందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఐక్యంగా ఆలోచించాలని... ఐక్యంగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు