CM Eknath Shinde: "మరాఠీ ప్రజలు తమ గుర్తింపును, గౌర‌వాన్ని కాపాడుకున్నారు. వారిని అవమానించకూడదు" అని మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అన్నారు. 

Maharashtra: రాజస్థానీలు, గుజరాతీలు వెళ్లిపోతే ముంబ‌యి భారత ఆర్థిక రాజధాని అనే గుర్తింపును కోల్పోతుందని గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించబోనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే అన్నారు. “గవర్నర్‌కు తన వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నాయి కానీ మేము అతని ప్రకటనలను సమర్థించము. ముంబ‌యి వాసులను, ముంబ‌యికి మరాఠీలు అందించిన సహకారాన్ని మనం ఎప్పటికీ మరచిపోలేం’’ అని సీఎం షిండే చెప్పినట్లు పీటీఐ పేర్కొంది.

“ దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యి అపారమైన సంభావ్యత కలిగిన ఒక ముఖ్యమైన నగరం. దేశం నలుమూలల నుండి ప్రజలు తమ నివాసంగా ఉన్నప్పటికీ, మరాఠీ ప్రజలు తమ గుర్తింపును, గౌర‌వాన్ని కాపాడుకున్నారు. వారిని అవమానించకూడదు.. ముంబ‌యి, మరాఠీ ప్రజలను ఎవరూ అవమానించలేరు” అని ముఖ్యమంత్రి ఎక్‌నాథ్ షిండే అన్నారు. ముంబ‌యి అనేక విపత్తులను ఎదుర్కొంది, కానీ అది ఎప్పటికీ ఆగదు.. అది 24x7 పని చేస్తూనే ఉంది.. వేలాది మందికి ఉపాధిని, జీవనోపాధిని ఇస్తూనే ఉంది అని అన్నారు. 

శుక్రవారం సాయంత్రం సబర్బన్ అంధేరిలో చౌక్ పేరుతో నిర్వ‌హించిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ “మహారాష్ట్ర నుండి గుజరాతీలు, రాజస్థానీలను, ముఖ్యంగా ముంబ‌యి, థానే నుండి తొలగిస్తే, మీకు డబ్బు లేకుండా పోతుందని నేను ఇక్కడి ప్రజలకు చెబుతున్నాను. ముంబ‌యి నేటి దేశ ఆర్థిక రాజ‌ధానిగా ఉండేది కాదు” అంటూ వ్యాఖ్యానించారు. గ‌వ‌ర్న‌ర్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేప‌డంతో ఆయ‌న మ‌ళ్లీ ఇదే విష‌య‌పై స్పందించారు. త‌న వ్యాఖ్యను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. దీనిపై గొడవ చేయవద్దని రాజకీయ పార్టీలను కోరారు. మరాఠీ మాట్లాడే ప్రజల సహకారాన్ని కించపరిచే ప్రశ్నే లేదని, ఒక వర్గాన్ని ప్రశంసించడం అంటే మరో వర్గాన్ని అవమానించడం కాదని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలావుండ‌గా, గవర్నర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. “గవర్నర్ మరాఠీ ప్రజలపై తన మనస్సులో ఉన్న ద్వేషం అనుకోకుండా బయటపడింది. కోష్యారీని తిరిగి ఇంటికి పంపాలా లేక జైలుకు పంపాలా అనేది తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది...గత మూడేళ్లలో మహారాష్ట్రలో ఉంటూ మరాఠీ మాట్లాడే వారిని అవమానించాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో ఆయన గవర్నర్‌ పదవికి అగౌరవం తెచ్చారు” అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 

ఇదిలావుండగా, ఉద్ధవ్ థాక్రే, ఏక్ నాథ్ షిండే వార్ కొనసాగుతోంది. అంతకుముందు, శివ‌సేన అధ్య‌క్షుడు ఉద్ధ‌వ్ థాక్రే పై మ‌హారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే (CM Eknath Shinde) తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తాను మాట్లాడ‌టం ప్రారంభిస్తే `భూకంపం` వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, ఎన్సీపీల‌తో పొత్తుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. కేవ‌లం ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం.. ఆయ‌న ముఖ్య‌మంత్రి కావ‌డం కోసం బాలా సాహెబ్ సిద్ధాంతాల‌తో థాక్రే రాజీ ప‌డ‌లేదా? అని ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల్లో అయితే బీజేపీతో క‌లిసి చేస్తారు. కాంగ్రెస్‌, ఎన్సీపీల‌తో క‌లిసి ప్ర‌భుత్వ ఏర్పాటుతో ముఖ్య‌మంత్రి అవుతారు. ఇది ద్రోహం కాదా? అంటూ ఉద్ధ‌వ్ థాక్రేను నిల‌దీశారు.