అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామంటే ఎవరూ నమ్మలేదు - కేంద్ర మంత్రి అమిత్ షా
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిరం (Ayodhya Ram temple) నిర్మిస్తామని అంటే ఎవరూ నమ్మలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) అన్నారు. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, అభివృద్ధి వేరు వేరు కావని చెప్పారు.
Ayodhya Ram temple : అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామంటే ఎవరూ నమ్మలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 69వ జాతీయ సదస్సును ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, అభివృద్ధి చేయడం పరస్పర విరుద్ధమైనవి కావని అన్నారు. గతంలో అయోధ్యలో రామాలయాన్ని నిర్మించవచ్చని ఎవరూ నమ్మలేదని తెలిపారు.
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు..
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేక సందర్భాల్లో పోరాడిందని అమిత్ షా అన్నారు. జ్ఞానం, వినయం, ఐక్యత అనే ప్రాథమిక మంత్రాన్ని అలవర్చుకోవడం ద్వారా ఓపికగా మార్గం సుగమం చేసిందని చెప్పారు. దేశం ముందు, విద్యారంగంలో, దేశ సరిహద్దుల్లో ఎదురయ్యే ప్రతి సవాలును విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఎదుర్కొన్నారని కొనియాడారు. ఇది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని చెప్పారు.
కాగా.. దేశ రాజధాని ఢిల్లీలోని బురారీలోని డీడీఏ మైదానంలో నూతనంగా నిర్మించిన టెంట్ సిటీ ఇంద్రప్రస్థ నగర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలకు చెందిన 10 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో విద్యా, పర్యావరణం, క్రీడలు, కళలు, కరెంట్ అఫైర్స్ సహా దేశంలోని యువతకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఏబీవీపీ వ్యవస్థాపక సభ్యుడు దత్తాజీ దిడోల్కర్ పేరిట ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. భారతీయ జనతా పార్టీ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ శుక్రవారం యూపీలోని అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి సంబంధించిన తాజా చిత్రాలను పోస్ట్ చేసింది. అవి ఎక్స్ లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.