కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రతి రోజూ వేలమంది ఈ వైరస్ బారినపడుతున్నారు. కాగా..  వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. ఈ వైరస్ సోకే అవస్థలు పడుతున్నారంటే.. ప్రైవేటు ఆస్పత్రులు కూడా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. రోగులకు ఆస్పత్రులు చుక్కలు చూపిస్తున్నాయి.

 తాజాగా ఓ మహిళ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నా 4 రోజుల పాటు ఆస్పత్రికే పరిమితం కావాల్సి వచ్చింది. బిల్లు పూర్తిగా చెల్లించే వరకూ ఆమెను ఇంటికి పంపించేది లేదని తేల్చి ఆస్పత్రి యాజమాన్యం తేల్చి చెప్పడమే ఇందుకు కారణం. సదరు బాధితురాలికి 66 సంవత్సరాలు. పూణెలోని ఓ మురికివాడలో ఆమె నివసిస్తుంటుంది. 


ఇటీవల బాధితురాలికి కరోనా సోకడంతో ప్రభుత్వం ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి రిఫర్ చేసేంది. అయితే వ్యాధి పూర్తిగా తగ్గే నాటికి బాధితురాలు ఆస్పత్రికి రూ. 55 వేలు బాకీ పడింది. మొత్తం బాకీ చెల్లించి పేషెంట్‌ను తీసుకెళ్లాలంటూ ఆస్పత్రి  వారు ఆమె బంధువులకు కబురంపారు. అయితే మిగిలిన మొత్తం ఇవ్వలేమంటూ ఆమె కుటుంబసభ్యులు చేతులెత్తేశారు.

 కరోనా దెబ్బకు కొన్ని నెలలుగా తమకు ఎటువంటి ఆదాయం లేదని గోడు వెళ్లబోసుకున్నారు. ఇంత చెప్పినా కూడా కనికరించని ఆస్పత్రి వర్గాలు.. బాధితురాలని ఇంటికి పంపేందుకు నిరాకరించాయి. దీంతో షాకైన  కుటుంబసభ్యులు ఓ లాయర్ సాయంతో ముస్సిపల్ కార్పొరేషన్‌ ఉన్నతాధికారులను కలిశారు. అధికారులు రంగంలోకి దిగడంతో లొంగిన ఆస్పత్రి యాజమాన్యం..బాకీ మొత్తాన్ని రద్దు చేసుకుని బాధితురాలిని ఇంటికి పంపించింది.