భారత తొలి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ (jawaharlal nehru birth anniversary) జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

భారత తొలి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ (jawaharlal nehru birth anniversary) జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌తో పాటు కేంద్ర మంత్రులు నివాళులు అర్పించకపోవడాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ (congress) పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రముఖుల జయంతి రోజు వారికి నివాళులు అర్పించేందుకు సెంట్రల్‌ హాల్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో ఏర్పాటు చేసిన ప్రముఖ నాయకుల చిత్రపటాల్లో ఉన్నవారి జయంతి రోజు వారికి నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ (jai ram ramesh) గుర్తుచేశారు. కానీ భారత తొలి ప్రధాని నెహ్రూ జయంతి సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ ఛైర్మన్‌ కూడా గైర్హాజరు అయ్యారని.. కనీసం ఒక్క కేంద్ర మంత్రి కూడా హాజరు కాలేదని రమేశ్ మండిపడుతూ ట్వీట్ చేశారు. అటు జైరాం రమేష్‌ ట్వీట్‌కు తృణమూల్‌ నేత డెరెక్‌ ఓబ్రెయిన్‌ (derek o brien) కూడా ఘాటుగా స్పందించారు. ఇందులో తనకేం ఆశ్చర్యం లేదని.. పార్లమెంటుతో సహా దేశంలో గొప్ప వ్యవస్థలను ఒక్కొక్కటిగా నాశనం చేయడం ఇందుకు మినహాయింపు ఏమీ కాదని కేంద్ర ప్రభుత్వాన్ని ఒబ్రెయిన్ విమర్శించారు.

అంతకుముందు పండిట్ నెహ్రూకు ప్రధాని నరేంద్రమోడీ (narendra modi) నివాళులు అర్పించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా నెహ్రూకు అంజలి ఘటించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని శాంతివనంలోని నెహ్రూ స్మారకం వద్దకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నెహ్రూ సేవలను స్మరించుకున్న సోనియా గాంధీ (sonia gandhi).. త్రివర్ణ రంగుల్లో ఉన్న బెలూన్లను గాలిలోకి వదిలిపెట్టారు. ఆమెతో పాటు పలువురు కాంగ్రెస్‌ ప్రముఖులు కూడా నెహ్రూ స్మారకానికి నివాళులు అర్పించారు.