రోజుకి కొన్ని వందలు, వేల మంది పుడుతుంటారు. వారిలో కొందరు ఆడపిల్లలు ఉంటే... మరికొందరు మగ పిల్లలు ఉంటారు. కానీ.... 132 గ్రామాల్లో మాత్రం ఆడపిల్ల పుట్టడం లేదు. వరసగా మగపిల్లలే పుడుతుండటం గమనార్హం. ఈ సంఘటన  ఉత్తరాఖండ్  రాష్ట్రంలో చోటుచేసుగా... దేశవ్యాప్తంగా ఈ సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 

ఒకప్పటితో పోలిస్తే సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఆడపిల్ల పుడితో ఆ బిడ్డ తల్లిదండ్రులు ఏదో నేరం చేసినట్లుగా ఫీలయ్యేవారు. కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలియగానే చాలా మంది అబార్షన్లు చేసుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఏ బిడ్డైనా ఒక్కటే అనే భావనకు నేతి తరంవారు ఆలోచిస్తున్నారు. అయితే ఇది కేవలం నేణేనికి ఒకవైపు మాత్రమే అని ఓ చేదు నిజం తాజాగా వెలుగు చూసింది. ఇప్పటికీ ఆడపిల్ల భూమికి భారం అని భావించే వారు ఉన్నారని ఓ సర్వేలో తేలింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాల్లోని 132 గ్రామాల్లో గత మూడు నెలలుగా ఒక్క ఆడపిల్ల కూడా పుట్టలేదు. గత మూడు నెలల్లో మొత్తం 216మంది జన్మించగా.. అందులో ఒక్కరు కూడా ఆడపిల్ల లేకపోవడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేసింది. దీని వెనక ఉన్న అసలు నిజం ఏంటో తెలుసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఆ గ్రామాల్లో ఆడ పిల్లలపై వివక్ష ఎక్కువగా ఉందని... అందుకే  కడుపులో బిడ్డ ఆడో-మగో తెలుసుకొని వెంటనే అబార్షన్లు చేయించుకుంటున్నారని స్థానిక నేతలు చెబుతున్నారు.  ఒకవైపు దేశ ప్రధాని బేటీ బచావో- బేటీ పడావో కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు  చేస్తుంటే... మరో వైపు ఇలా ఎందరో ఆడబిడ్డలు తల్లి కడుపులోనే కనుమరుగైపోతున్న సంఘటన అందరినీ కలచివేస్తోంది. 

ఈ ఘటనపై సామాజికవేత్త కల్పనా ఠాకూర్ స్పందించారు. ప్రసవానికి ముందే గుర్తించి కడుపులోనే బాలికలను భ్రూణ హత్యలు చేస్తున్నందు వల్లే ఆడబిడ్డలు పుట్టలేదని కల్పనా ఆరోపించారు. ఆడపిల్లల భ్రూణ హత్యలు కొనసాగుతున్నందువల్లే ఆడబిడ్డలు పుట్టటం లేదని సీనియర్ జర్నలిస్టు శివసింగ్ ఆరోపించారు. భ్రూణ హత్యలను నివారించేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని శివసింగ్ డిమాండు చేశారు. 132 గ్రామాల్లో ఒక్క ఆడపిల్ల జన్మించక పోవడం వల్ల బేటీ బచావో బేటీ పడావో కేంద్ర పథకం అమలు ప్రశ్నార్థకంగా మారిందని శివసింగ్ చెప్పారు.