బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లభించలేదు!
భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎ్‌ఫఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు లేవంటూ ఢిల్లీ పోలీసులు తెలిపారు.

రెజ్లర్ల నిరసన: దేశ రాజధాని ఢిల్లీలో నెలరోజులకు పైగా కొనసాగుతున్న రెజ్లర్ల ఉద్యమానికి ఢిల్లీ పోలీసుల నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు లేవని ఢిల్లీ పోలీసులు తెలపడం చర్చనీయంగా మారింది. బ్రిజ్ భూషణ్ శరణ్ కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేసిన ఆరోపణలను సమర్థించే అనుబంధ సాక్ష్యాలు దొరకలేదు. రెండు ఎఫ్‌ఐఆర్‌లలో బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన అభియోగాలు పోక్సో సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్షార్హమైనవని, కాబట్టి ఆ సెక్షన్‌లో కూడా తక్షణ అరెస్టు అవసరం లేదని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.
రెండవది.. ఇప్పటివరకు జరిపిన విచారణ ప్రకారం.. ఢిల్లీ పోలీసులకు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అలాంటి ఇన్‌పుట్ ఏదీ అందలేదు. అలాగే.. బాధితులను బెదిరించే ప్రయత్నం లేదా వారిని సంప్రదించే ప్రయత్నం చేయలేదని తెలుస్తుంది. ఈ రెండు కారణాల వల్ల ఇప్పటి వరకు జరిగిన విచారణ ప్రకారం ఎంపీని పోలీసులు అరెస్ట్ చేయలేదంటూ ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు.
మరో 15 రోజుల్లో విచారణ పూర్తి ?
ఢిల్లీ పోలీసుల వర్గాల సమాచారం ప్రకారం.. బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్టు చేయడానికి మాకు ఇప్పటివరకు తగిన ఆధారాలు లభించలేదనీ, మరో 15 రోజుల్లోగా కోర్టుకు నివేదిక అందజేయనున్నట్టు తెలుస్తోంది. ఇది ఛార్జ్ షీట్ లేదా తుది నివేదిక కావచ్చు. మహిళా రెజ్లర్లు చేసిన వాదనను నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు కనుగొనబడలేదనీ, ఈ కేసులో పోలీసులకు ఇచ్చిన డాక్యుమెంట్ల వాస్తవికతను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
మహిళా రెజ్లర్లు వేసిన కేసులో పోలీసులు తుది నివేదికను దాఖలు చేసినట్లు కొన్ని మీడియా ఛానళ్లు వార్తలను ప్రసారం చేస్తున్నాయి. అయితే, ఈ వార్త మీడియాలో ప్రసారం అయిన వెంటనే ఢిల్లీ పోలీసులు ఒక ట్వీట్ చేశారు. మహిళా రెజ్లర్లపై నమోదైన కేసులో పోలీసులు తుది నివేదికను దాఖలు చేసినట్లు కొన్ని మీడియా ఛానళ్లు వార్తలను ప్రసారం చేస్తున్నారు. ఈ వార్త పూర్తిగా తప్పు. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. పూర్తి విచారణ తర్వాత మాత్రమే సరైన నివేదికను కోర్టులో సమర్పిస్తామని పేర్కొన్నారు.
కాగా.. ఢిల్లీ పోలీసుల ట్వీట్లపై బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ స్పందించారు. తనపై వచ్చిన ఒక్క ఆరోపణ నిజమని తేలినా.. తాను ఉరి వేసుకుంటాననీ, రెజ్లర్ల దగ్గర ఆధారాలుంటే.. కోర్టుకు సమర్పించాలని, కోర్టు విధించే ఎలాంటి శిక్షకైనా తాను సిద్దంగా ఉన్నానని సవాల్ విసిరారు. ఈ అంశంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్పందించారు. దర్యాప్తు పూర్తయ్యాక చర్యలుంటాయని భరోసా ఇచ్చారు.