దళిత మహిళను వివస్త్రను చేసి.. విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ సంఘటన రాజస్తాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ లో చోటుచేసుకోగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉదయ్ పూర్, ఆలోద్ గ్రామానికి చెందిన సోసర్ బాయి అనే దళిత మహిళ కొద్ది రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన చాందీ బాయితో గొడవపడింది. ఇద్దరూ దుర్భాషలాడుకున్నారు. ఈ నేపథ్యంలో సోసర్‌పై కక్ష పెంచుకున్న చాందీ అవకాశం కోసం ఎదురుచూడసాగింది. ఈ నెల 28న సోసర్‌ ఇంటివద్ద బట్టలు ఉతుక్కుంటుండగా చాందీ బాయి ఆమె కుమారుడు కిషన్‌ తెలి బైక్‌పై అక్కడికి వచ్చారు. 

అనంతరం చాందీ, సోసర్‌ చేతుల్ని వెనక్కు విరిచి పట్టుకుంది. కిషన్..‌ సోసర్‌ను విచక్షణా రహితంగా కొట్టాడు. ఆ తర్వాత ఆమెను వివస్త్రను చేసి ఇద్దరూ సైకిల్‌ చైన్‌తో కొట్టారు.

దీంతో బాధితురాలి వేళ్లు విరిగిపోయాయి. విపరీతంగా దెబ్బలు తగిలాయి. ఆమె సహాయం కోసం ఎంత అరిచినా జనం రాలేదు. దెబ్బలు తాళలేక స్పృహ కోల్పోయింది. నిందితులు అక్కడినుంచి వెళ్లిపోయారు. పొలంలో పని చేసుకుంటున్న సోసర్‌ బాయి భర్త విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. రక్తపు మడుగులో పడిఉన్న భార్యను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. ఆ రోజు సాయంత్రం దుగ్లా పోలీస్‌ స్టేషన్‌లో తల్లీ, కుమారుడిపై ఫిర్యాదు చేశాడు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.