మరోసారి లాక్‌డౌన్ ఆలోచన లేదు: తేల్చేసిన కేజ్రీవాల్
కరోనా కేసులు పెరుగుతున్నందున మరోసారి ఢిల్లీలో లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించాలనే ఆలోచన తమకు లేదన్నారు.
న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరుగుతున్నందున మరోసారి ఢిల్లీలో లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించాలనే ఆలోచన తమకు లేదన్నారు.
ఢిల్లీలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం నేపథ్యంలో కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా ఈ ప్రచారాన్ని ఖండించారు. కరోనా వైరస్ నిరోధించేందుకు తమిళనాడు రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో లాక్ డౌన్ విధిస్తున్నట్టుగా ఇవాళ తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ఏడాది మార్చి 25వ తేదీ నుండి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐదో విడత లాక్ డౌన్ అమల్లో ఉంది. లాక్ డౌన్ అమల్లో ఉన్నా చాలా రంగాలకు ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది.
ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 41 వేలకు చేరుకొంది. ఇప్పటివరకు కరోనాతో ఢిల్లీలో 1300 మంది మరణించారు.ఢిల్లీలో కరోనా రోగులకు అందిస్తున్న చికిత్స విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా పరీక్షలు తగ్గించడంపై కూడ కోర్టు తప్పుబట్టింది.
దరిమిలా ఈ నెల 14వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ తో పాటు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న కేసులను మూడు రెట్లకు పెంచాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. మరో వైపు కరోనా రోగులకు ఆసుపత్రుల్లో బెడ్స్ కొరతను తీర్చేందుకు గాను 500 రైల్వే కోచ్‌లను అందుబాటులోకి తీసుకొస్తామని అమిత్ షా ఢిల్లీ ప్రభుత్వానికి హామీ ఇచ్చారు.