న్యూఢిల్లీ: ఎన్ఆర్సీని దేశవ్యాప్తంగా అమలు చేయాలనే నిర్ణయాన్ని తీసుకోలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లోకసభలో స్పష్టం చేసింది. ఓ ప్రశ్నకు లోకసభ లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ కేంద్రం ఆ విషయం చెప్పింది. 

ఎన్ఆర్సీని దేశవ్యాప్తంగా అమలుచేసే ప్రణాళిక ఏదైనా ఉందా అని అడిగిన ప్రశ్నకు, హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ స్థాయిలో ఎన్ఆర్సీ అమలుకు ఇప్పటి వరకైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. 

జాతీయ స్థాయిలో ఎన్ఆర్సీ అమలుకు అనుసరిస్తున్న విధానాల గురించి, పౌరులపై అది వేసే అదనపు భారం గురించి వేసిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆ ప్రశ్నలకు తావు లేదని హోం మంత్రిత్వ శాఖ సమాధానమిచ్చింది.

బడ్దెట్ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రతిపక్షాలు సిఏఏ, ఎన్ఆర్సీలపై చర్చకు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. సిఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలపై తక్షణ చర్చకు అనుమతించాలని కోరుతున్నట్లు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ చెప్పారు. డిఎంకే, సిపిఐ, సీపిఎం, ఎన్సీపీ, టీఎంసీ, ఎస్పీ, బిఎస్పీ 267వ నిబంధన కింద చర్చకు నోటీసులు ఇచ్చాయి. 

పౌరసత్వం బిల్లు చట్టం కావడంతో దేశవ్యాప్తంగా దానికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్నాయని ఆజాద్ అన్నారు.