Asianet News TeluguAsianet News Telugu

యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై క్లారటీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం

దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం గురువారం రాజ్యసభకు తెలియజేసింది. యూనిఫాం సివిల్ కోడ్‌కు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి సిఫార్సులు చేయాలని ప్రభుత్వం 21వ లా కమిషన్‌ను అభ్యర్థించిందని న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 

No Decision As Of Now On Implementation Of Uniform Civil Code: Centre
Author
First Published Feb 2, 2023, 11:06 PM IST

దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుపై వస్తున్న ఊహాగానాలన్నింటినీ కేంద్రప్రభుత్వం తోసిపుచ్చింది. యూనిఫాం సివిల్ కోడ్‌కు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి సిఫార్సులు చేయాలని ప్రభుత్వం 21వ లా కమిషన్‌ను అభ్యర్థించిందని న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ విషయంలో కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. లా కమిషన్ నుండి అందిన సమాచారం ప్రకారం..యూనిఫాం సివిల్ కోడ్‌కు సంబంధించిన అంశాన్ని 22వ లా కమిషన్ పరిశీలనకు తీసుకోవచ్చని ఆయన తెలియజేశారు. అందువల్ల యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. 

ప్రస్తుత లా ప్యానెల్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ప్యానెల్ పదవీకాలాన్ని మూడేళ్లపాటు పొడిగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సూచించాయి. ప్రస్తుత లా ప్యానెల్ ఫిబ్రవరి 21, 2020న ఏర్పాటైంది, అయితే దాని చైర్‌పర్సన్, సభ్యులు గత ఏడాది నవంబర్‌లో అంటే ప్యానెల్ పదవీకాలం ముగియడానికి నెలల ముందు నియమించబడ్డారు. 21వ లా కమిషన్ యూనిఫాం సివిల్ కోడ్‌కు సంబంధించిన వివిధ సమస్యల పరిశీలనను చేపట్టింది. విస్తృత చర్చల కోసం తన వెబ్‌సైట్‌లో "కుటుంబ చట్టం యొక్క సంస్కరణ" పేరుతో ఒక కన్సల్టేషన్ పేపర్‌ను అప్‌లోడ్ చేసింది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీ చేసిన ఎన్నికల వాగ్దానమే యూనిఫాం సివిల్ కోడ్ అమలు ఒక్కటి. 

సుప్రీంకోర్టు కొలీజియం విషయంలో కూడా న్యాయమంత్రి సమాధానమిచ్చారు. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి గత మూడేళ్లలో సుప్రీంకోర్టు కొలీజియం పంపిన మొత్తం 18 ప్రతిపాదనలను ప్రభుత్వం పునఃపరిశీలన కోసం వెనక్కి పంపిందని తెలిపారు. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మొత్తం 64 ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు రిజిజు ఈ విధంగా సమాధానమిచ్చారు.

న్యాయ మంత్రి ప్రకారం.. సుప్రీంకోర్టు కొలీజియం ఏడు ప్రతిపాదనలపై హైకోర్టు కొలీజియం నుండి సమాచారాన్ని కోరింది. మిగిలిన ఐదు ప్రతిపాదనలను హైకోర్టుకు పంపాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. 34 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో ఏడు ఖాళీలు ఉన్నాయని, అన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు కొలీజియం ఇటీవల సిఫార్సులు చేసిందని మరో ప్రశ్నకు న్యాయమంత్రి బదులిచ్చారు. ఏడాదిలో సగటున 222 రోజులు సుప్రీంకోర్టు పనిచేస్తోందని కిరెన్ రిజిజు రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఆయా కోర్టులు రూపొందించిన నిబంధనల ప్రకారం.. కోర్టుల పని గంటలు, పనిదినాలు, సెలవుల సంఖ్యను నిర్ణయించబడుతుందని మంత్రి తెలిపారు.

అదే సమయంలో.. 2021-22లో జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలు,ప్రదేశాల పరిరక్షణ, నిర్వహణ కోసం కేంద్రం రూ. 26,957.32 లక్షలు ఖర్చు చేసిందని కేంద్ర ప్రభుత్వం  పార్లమెంటుకు తెలిపింది. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో గత మూడేళ్లలో దేశంలోని 143 ప్రదేశాలలో స్మారక చిహ్నాల ప్రవేశ రుసుము నుండి సేకరించిన ఆదాయాన్ని కూడా పంచుకున్నారు. దేశంలో 3,696 కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు ఉన్నాయి, ఇవి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తాయి. వీటిలో ఉత్తరప్రదేశ్‌లో 743, కర్ణాటకలో 506, తమిళనాడులో 412 ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios