లైంగిక వేధింపుల ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని భారత అగ్రశ్రేణి రెజ్లర్లు డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో వారి నిరసనలపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

లైంగిక వేధింపుల ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని భారత అగ్రశ్రేణి రెజ్లర్లు డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ జరిగిన రెండు రోజుల తర్వాత సాక్షి మాలిక్, బజ్‌రంగ్ పునియా, వినేష్ ఫొగాట్ రైల్వేలో వారి ఉద్యోగాలకు హాజరుకావడంతో పలు వదంతులు వ్యాప్తి చెందాయి. అయితే రెజ్లర్లు మాత్రం తాము ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. 

తాజాగా బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేక ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న రెజ్లర్లలో ఒకరైన బజరంగ్ పునియా ఎన్డీటీవీ మాట్లాడుతూ.. హోం మంత్రితో తమకు ఎలాంటి ‘‘సెట్టింగ్’’ లేదని చెప్పారు. దర్యాప్తు జరుగుతోందని షా తమకు చెప్పారని తెలిపారు. తమ నిరసన ఉద్యమం ఆగిపోలేదని స్పష్టం చేశారు. తమ నిరసన కొనసాగుతుందని బజరంగ్ పునియా తెలిపారు. ఈ నిరసనను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై మేము వ్యూహరచన చేస్తున్నామని వెల్లడించారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన రెజ్లర్లు డీల్ కుదుర్చుకున్నారని.. ఇక నిరసనలు చేయడం వల్ల ప్రయోజనం లేదని నిర్ణయానికి వచ్చారనే పుకార్లపై బజరంగ్ పునియా మాట్లాడుతూ.. అమిత్ షాతో సమావేశం గురించి చర్చించవద్దని ప్రభుత్వం తమను కోరిందని చెప్పారు. అయితే తామే మీడియాకు సమాచారాన్ని లీక్ చేశామని చెప్పారు. ‘‘ప్రభుత్వ ప్రతిస్పందనతో అథ్లెట్లు సంతృప్తి చెందలేదు.. మా డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడం లేదు’’ ఇప్పటికే బజరంగ్ పునియా వెల్లడించిన సంగతి తెలిసిందే. 

బజరంగ్ పునియా మాట్లాడుతూ.. బ్రిజ్ భూషణ్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని తాము అడిగామని, చర్యలు తీసుకుంటామనే హామీపై వెనక్కి తగ్గమని స్పష్టం చేశామని తెలిపారు. రెజ్లర్లు తమ రైల్వే ఉద్యోగాల్లో తిరిగి చేరడంపై నిరసనలు తగ్గుముఖం పడతాయని ఇటీవల వచ్చిన ఊహాగానాలపై స్పందిస్తూ.. జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టడానికి రెజ్లర్లు తమ ఉద్యోగాల నుంచి సెలవు తీసుకున్నారని, ఇప్పుడు సైన్ ఇన్ చేయడానికి ఒక రోజు తిరిగి రిపోర్టు చేశారని చెప్పారు. ‘‘మేము మా ఉద్యోగాలకు తిరిగి వెళ్ళలేదు’’ అని తెలిపారు. 

‘‘మేము అన్నింటినీ పణంగా పెట్టాము. మా ఆందోళనకు అడ్డంకిగా మారితే మా ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది పెద్ద విషయం కాదు. ఇది గౌరవం కోసం పోరాటం. మేము పుకార్లకు, రైల్వే ఉద్యోగాన్ని పోగొట్టుకునేందుకు భయపడం. ఎవరైనా మాపై ఒత్తిడి తెస్తే మేము ఉద్యోగం మానేస్తాము’’ అని బజరంగ్ పునియా చెప్పారు. 

ఇక, మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నిష్పాక్షిక విచారణ జరిపి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారు గతకొంతకాలంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి పతకాలను గంగా నదిలో వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసహరించుకుని ప్రభుత్వానికి ఐదు రోజుల డెడ్ లైన్ విధించారు. 

ఈ క్రమంలోనే శనివారం రాత్రి 11 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన నివాసంలో రెజ్లర్లు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీతా ఫోగట్, సత్యవర్త్ కడియన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చట్టం అందరికీ ఒకేలా ఉంటుందని అమిత్ షా రెజ్లర్లకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. చట్టం తన పని తాను చేస్తుందని ఆయన రెజ్లర్లతో చెప్పినట్లు నివేదికలు వెలువడ్డాయి.