జమ్మూకాశ్మీర్‌లో మీడియాపై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. దేశ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే ఏ కార్యకలాపాల్లోనైనా పాల్గొన్నట్లు గుర్తిస్తే ఎవరిని వదలబోమని చెప్పారు.  

ఆర్టికల్ 370 రద్దు (article 370 scrapped) , కేంద్రపాలిత ప్రాంతంగా మారడంతో జమ్మూకాశ్మీర్‌లో (jammu and kashmir) ప్రస్తుతం సాధారణ పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఉగ్రవాదుల ఏరివేతపై సైన్యం, పోలీసులు దృష్టి పెట్టడంతో గత కొంతకాలంగా నేరాలు, ఉగ్రదాడులు తగ్గాయి. ఇటీవల పెట్టుబడుల సదస్సును కూడా నిర్వహించి పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలికారు. అయితే పరిపాలనా విభాగం విధించిన విస్తృతమైన ఆంక్షల కారణంగా జమ్మూ కశ్మీర్‌లోని మీడియా సంస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన నివేదికలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (press council of india) నియమించిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (ఎఫ్ఎఫ్‌సీ) ఈ మేరకు పేర్కొంది. 

తాజాగా దీనిపై కేంద్రం స్పందించింది. జమ్మూ కశ్మీర్‌లో మీడియాపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని శుక్రవారం పార్లమెంట్‌లో (parliament budget session) కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (anurag thakur) ప్రకటించారు. అలాగే జమ్మూ కశ్మీర్‌లోని అనేక మంది జర్నలిస్టులపై (journalists) వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయన్న అంశాన్ని సైతం ఆయన తోసిపుచ్చారు. జర్నలిస్టులపై పాలనా విభాగం నుంచి ఎలాంటి ఒత్తిడులు లేవని, వారిపై ఎలాంటి దాడులు జరగడం లేదని పార్లమెంట్‌కు తెలిపారు. అయితే, దేశ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే ఏ కార్యకలాపాల్లోనైనా పాల్గొన్నట్లు గుర్తిస్తే.. వారి వృత్తితో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అనురాగ్ ఠాకూర్ చెప్పారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లోని అనేక పనుల్లో పోలీసుల జోక్యం ఉందని వస్తున్న ఆరోపణల్ని కూడా కేంద్ర మంత్రి ఖండించారు. 

జమ్మూ కశ్మీర్‌లో మీడియా పరిస్థితిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎఫ్ఎఫ్‌సీ ఒక నివేదికను విడుదల చేసిందని, దాని గురించి ప్రభుత్వానికి తెలుసా అని తృణమూల్ ఎంపీ అబిర్ రంజన్ రాజ్యసభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పై విధంగా సమాధానం ఇచ్చారు. మార్చి 8న విడుదల చేసిన ఎఫ్ఎఫ్‌సీ నివేదిక ప్రకారం.. కశ్మీర్ లోయలో ఉన్న మీడియాపై అనేక ఆంక్షలు అమలులో ఉన్నాయని తెలిపింది. 2017 నుంచి మీడియాపై ఆంక్షలు, జర్నలిస్టులపై దాడులు పెరిగాయట. వ్యక్తిగతంగా కూడా జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు.