Asianet News TeluguAsianet News Telugu

నా ట్విట్ట‌ర్ అకౌంట్ బ‌యోలో ఎలాంటి మార్పులూ చేయలేదు - గులాం న‌బీ అజాద్

తన ట్విట్ట‌ర్ బ‌యో మార్చుకున్నార‌ని వ‌స్తున్న పుకార్లను గులాం నబీ అజాద్ ఖండించారు. ఆ వార్త‌ల‌న్నీ అవాస్త‌వాల‌ని కొట్టిపారేశారు. గంద‌ర‌గోళం సృష్టించ‌డానికే ఇవి కొందరు చేస్తున్న ప్ర‌చారమ‌ని అన్నారు.

No changes were made to my Twitter account bio - Ghulam Nabi Azad
Author
Delhi, First Published Jan 26, 2022, 12:21 PM IST

కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు గులాం న‌బీ అజాద్ (gualm nabhi azad) కు ప‌ద్మభూష‌న్ అవార్డు ప్ర‌క‌టించిన త‌రువాత తన ట్విట్ట‌ర్ బ‌యో (twitter bio) మార్చుకున్నార‌ని వ‌స్తున్న పుకార్లను ఆయ‌న ఖండించారు. ఆ వార్త‌ల‌న్నీ అవాస్త‌వాల‌ని కొట్టిపారేశారు. గంద‌ర‌గోళం సృష్టించ‌డానికే ఇవి కొందరు చేస్తున్న ప్ర‌చారమ‌ని అన్నారు. కావాల‌నే దుష్ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో ఏదీ తొలగించలేదని, ఏదీ మార్చలేద‌ని స్ప‌ష్టం చేశారు. ట్విట్ట‌ర్ ప్రొఫైల్ గ‌తంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. 

కాంగ్రెస్ కుర‌వృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి గులాం న‌బీ అజాద్ పార్టీలో విస్తృతమైన సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ గ‌తంలో ఒక సారి సోనియా గాంధీకి లేఖ రాశారు. కొంత కాలం త‌రువాత ఆయ‌న జీ - 23 బృందానికి నాయ‌క‌త్వం వ‌హించారు. ఇక అప్ప‌టి నుంచి సోనియా గాంధీ కుటుంబ విధేయులకు గులాం న‌బీ అజాద్ టార్గెట్ గా మారారు. అప్ప‌టి నుంచి ఆయ‌న‌పై సొంత పార్టీ నాయ‌కులే ప‌లు సంద‌ర్భాల్లో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. 

కేంద్ర ప్రభుత్వం మంగ‌ళ‌వారం ప‌ద్మ అవార్డుల జాబితాను ప్ర‌క‌టించింది. ఇందులో గులాం న‌బీ అజాద్ కు పద్మ‌భూష‌న్ (padma bhushan) ఇస్తున్న‌ట్టు పేర్కొంది. ఈ అవార్డు రావ‌డం ప‌ట్ల తోటి నాయ‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. మ‌రో కాంగ్రెస్ సీనియ‌ర్ నాయకుడు జైరామ్ రమేష్ ‘‘ వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్జీ పద్మభూషణ్ అవార్డును తిరస్కరించారు. అయితే ఆయన ఆజాద్‌గా ఉండాలనుకుంటున్నాడు. గులాంగా కాదు’’ అని గులాం న‌బీ అజాద్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీంతో పాటు మాజీ పీఎన్ హస్కర్  అవార్డు తిరస్కరించడంపై రమేష్ ఓ పుస్తకంలోని భాగాన్ని కూడా ట్వీట్ చేశారు. ‘‘1973 సంవత్సరం జనవరిలో మన దేశంలోని అత్యంత శక్తివంతమైన ప్రభుత్వోద్యోగి PMO నుండి నిష్క్రమించినప్పుడు అతనికి పద్మవిభూషణ్‌ను అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దానికి ఆయ‌న జ‌వాబు ఈ పుస్త‌కంలో ఉంది. ఇది ప్ర‌స్తుతం అనుక‌రించేందుకు అర్హ‌త ఉంది’’ అని జైరాం రమేష్ ట్విట్టర్ లో క్యాప్షన్ పెట్టి ట్వీట్ చేశారు. 

ఇదిలా ఉండ‌గా.. మ‌రో కాంగ్రెస్ నాయ‌కుడు రాజ్ బబ్బర్ అజాద్ ను అభినందించారు. ‘‘గాంధీ సిద్ధాంతాల పట్ల అతని నిబద్ధతకు ఇది ఎల్లప్పుడూ ప్రేరణగా ఉంది’’ అని ఆయ‌న పేర్కొన్నారు.  ‘‘అభినందనలు @ghulamnazad Sahab ! మీరు అన్నయ్య లాంటి వారు. ఎవ‌రికీ హాని చేయ‌ని మీ ప్ర‌జా జీవితం, గాంధేయ ఆశయాల పట్ల నిబద్ధత ఎల్లప్పుడూ స్ఫూర్తి. # ఇప్పుడు వ‌చ్చిన పద్మభూషణ్ 5 ద‌శాబ్దాల పాటు మీరు దేశానికి చేసిన నిశిత సేవకు ఆదర్శవంతమైన గుర్తింపు’’ అని ఆయ‌న ట్వీట్ చేశారు. 

దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల ఈ ప‌ద్మ అవార్డులు ప్ర‌ముఖ‌మైన‌వి. ఇందులో పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. ఇవి కళలు, సామాజిక సేవ‌, ప్రజా వ్యవహారాలు, సైన్స్,ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవ వంటి రంగాల్లో కృషి చేసిన వారికి అంద‌జేస్తారు. ఈ అవార్డులను సాధారణంగా ప్రతీ సంవత్సరం మార్చి, ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఉత్సవ కార్యక్రమాలలో భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios