కులం, మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు అడగొద్దు .. రెడ్ లైన్ దాటారో : రాజకీయ పార్టీలకు ఈసీ హెచ్చరిక

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈసీ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ‘‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) ’’ అడ్వైజరీని జారీ చేసింది . నకిలీ వార్తలను సృష్టించడానికి అనుమతించబడదని.. ఇది పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగించవచ్చన్నారు. ఎలాంటి విద్వేష ప్రసంగాలు చేయరాదని, కులం , మతం ఆధారంగా ఓట్లు అడగొద్దని ఈసీ ఆదేశించింది. 
 

No caste or religious appeals Election Commissions advisory to political parties ksp

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఈసీ రాజీవ్ కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈసీ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ‘‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) ’’ అడ్వైజరీని జారీ చేసింది. ఏప్రిల్ 19 నుంచి దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నారు. డబ్బు, బలప్రయోగం. మోడల్ కోడ్ ఆఫ్ కండెక్ట్ ఉల్లంఘన, తప్పుడు సమాచారం అనేవి ఈసీ ఎదుర్కొంటున్న సవాళ్లుగా రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. పార్టీలు ప్రచార సమయంలో హుందాగా వ్యవహరించాలని.. దుర్వినియోగాలు, వ్యక్తిగత దాడులకు దూరంగా వుండాలని ఆయన సూచించారు. 

తప్పుడు సమాచారం ఎన్నికల సమయంలో తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందన్నారు. ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌ల సమయంలో సోషల్ మీడియా తమకు సహాయపడుతుందని గుర్తించామని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరినైనా విమర్శించే స్వేచ్ఛ వుందని తాము గుర్తించామని సీఈసీ స్పష్టం చేశారు. నకిలీ వార్తలను సృష్టించడానికి అనుమతించబడదని.. ఇది పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగించవచ్చన్నారు. అందుచేత దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేశామని సీఈసీ వెల్లడించారు. పార్టీలు బాధ్యతాయుతమైన సోషల్ మీడియా ప్రవర్తనను కలిగి వుండాలని.. నకిలీ వార్తలకు కారణమైన వారిపై కఠినంగా వ్యవహరించాలని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఈసీ హెచ్చరించారు. 

ఎన్నికల సంఘం జారీ చేసిన అడ్వైజరీలో ఏం చెప్పారంటే :

  • ఎలాంటి విద్వేష ప్రసంగాలు చేయరాదు
  • కులం , మతం ఆధారంగా ఓట్లు అడగొద్దు
  • వ్యక్తిగతంగా విమర్శలు చేయరాదు
  • ఎలాంటి ధ్రువీకరణ లేని, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు దూరంగా వుండాలి
  • ప్రత్యర్ధులను అవమానించేలా సోషల్ మీడియాలో ఎట్టి పరిస్ధితుల్లో పోస్టులు పెట్టకూడదు
  • దివ్యాంగులతో ప్రచార సమయంలో హుందాగా వ్యవహరించాలి
  • చిన్న పిల్లలను ఎట్టి పరిస్ధితుల్లోనూ ప్రచారంలో ఉపయోగించరాదు. 
     
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios