ఒకప్పుడు దేశం కోసం పతకాలు సాధించిన చేతులవి.. ఇప్పుడు అదే చేతులతో కుల్ఫీలు అమ్ముకుంటున్నాడు. తండ్రి చేసిన అప్పు తీర్చడానికి అతనికి అంతకన్నా మెరుగైన ఉపాధి ఏదీ కనిపించలేదు. అందుకే బాక్సింగ్ ని పక్కనపెట్టి.. కుల్ఫీలు అమ్ముకుంటున్నాడు అతనే బాక్సర్ దినేష్ కుమార్.

దినేష్ కుమార్, ఈ పేరు వినగానే బాక్సర్ గా ఇతని పేరు చాలా మందికి సుపరిచితమే. ఓ ప్రమాదంలో గాయపడిన అతడికి వైద్యం చేయించడానికి, అటు తరువాత అందర్జాతియ పోటీలకు పంపేందుకు దినేష్ తండ్రి బోలెడంత అప్పులు చేశాడు. ఇదంతా భారమై కూర్చోవడంతో తండ్రికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో దినేష్ తన తండ్రి వ్యాపారం అయిన కుల్ఫీలు అమ్ముకుంటూ.. నెలనెలా వడ్డీ కట్టుకుంటూ దుర్భరజీవితాన్ని గడిపేస్తున్నాడు.

దినేష్ బాక్సర్ గా తన కెరీర్ లో 17 స్వర్ణాలు, ఒక రజతం, 5 కాంస్యాలు సాధించాడు. అయినా ప్రభుత్వం నుండి చిన్న ఉద్యోగం కూడా రాకపోవటంతో చేసేది లేక పరిస్థితులకు లొంగిపోయి ప్రస్తుత్తం కుల్ఫీ( ఒక రకమైన ఐస్ క్రీమ్) అమ్ముకుంటూ బ్రతుకు నెట్టుకొస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తనకు ఒక ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాడు ఈ బాక్సర్. తనకు ఏదైనా ఆసరా చూపిస్తే, అంతర్జాతీయంగా ఆడే ఆటగాళ్లకు తర్ఫీదు కూడా ఇవ్వగలనని దినేష్ అంటున్నాడు.