TamilNadu : బీజేపీతో అన్నాడీఎంకేకు ఎలాంటి పొత్తు వుండదు .. తేల్చేసిన పళనిస్వామి, పార్టీ సమావేశంలోనే ప్రకటన
బీజేపీతో అన్నాడీఎంకేకు ఎలాంటి పొత్తు వుండదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి స్పష్టం చేశారు. అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం చెన్నైలోని వనగారంలోని శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్‌లో జరిగింది.
దక్షిణాదిలో తమిళనాడు రాజకీయాలు విభిన్నంగా , రసవత్తరంగా వుంటాయి. కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాల మరణంతో పొలిటికల్‌గా గ్యాప్ కనిపించినా స్టాలిన్, పళని స్వామి, పన్నీరు స్వామిలు రసవత్తర రాజకీయాలు నడుపుతున్నారు. రాష్ట్రంలో ద్రవిడ పార్టీలకే తమిళుల మద్ధతు వుంటుంది. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలకు ఇక్కడ స్థానం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో కాంగ్రెస్ పార్టీ హవా సాగినా తర్వాత డీఎంకే , ఇతర ద్రవిడ పార్టీల రాకతో కాంగ్రెస్ కనుమరుగైంది. ఆ తర్వాత డీఎంకే, అన్నాడీఎంకేలు రాజకీయ ప్రత్యర్ధులుగా మారాయి.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో డీఎంకేకు మిత్రపక్షంగా వుంటోంది. మరోవైపు.. జయలలిత మరణంతో అన్నాడీఎంకేతో బీజేపీ కలిసి పనిచేస్తూ వచ్చింది. అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఆయన తీరుతో అన్నాడీఎంకే నేతలు భగ్గుమంటున్నారు. మొన్నామధ్య జయలలిత అవినీతి, అక్రమాస్తుల కేసును ప్రస్తావించడం పెను దుమారం రేగింది. ఈ నేపథ్యంలో బీజేపీతో అన్నాడీఎంకేకు ఎలాంటి పొత్తు వుండదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి స్పష్టం చేశారు.
ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) మంగళవారం కీలక సమావేశం నిర్వహించింది. డిఎంకె ప్రభుత్వం శాంతిభద్రతల సమస్యలపై , తుఫాను సహాయ నిధుల పంపిణీలో అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ 23 తీర్మానాలను ఆమోదించింది. అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం చెన్నైలోని వనగారంలోని శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్‌లో జరిగింది. మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామిని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికల సంఘం , సుప్రీంకోర్టు గుర్తించిన తర్వాత జరిగిన ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ సందర్భంగా పళని స్వామి ప్రసంగిస్తూ.. ఎంజీఆర్, జయలలిత మార్గదర్శకత్వంలో అన్నాడీఎంకే 30 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించింది కాబట్టే దేశంలో తమిళనాడు నంబర్‌వన్‌గా వుందన్నారు. ఏఐఏడీఎంకే మాదిరిగా తమిళనాడును 30 ఏళ్ల పాటు మరే ఇతర పార్టీ పాలించలేదని పళనిస్వామి చెప్పారు. ఈ భేటీలోనే బీజేపీతో అన్నాడీఎంకేకు ఎలాంటి పొత్తు వుండదని ఆయన స్పష్టం చేశారు.
ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి మార్గనిర్దేశం చేయడంతో పాటు మధురైలో జరిగిన అన్నాడీఎంకే కాన్ఫరెన్స్ విజయవంతమైనందుకు ప్రశంసిస్తూ ఆమోదించిన తీర్మానాల్లో వున్నాయి. ఈశాన్య రుతుపవనాలు, మైచాంగ్ తుఫాన్ సమయంలో డీఎంకే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని , అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడం, ప్రతిపక్షనేత ప్రసంగం సమయంలో ఉద్దేశపూర్వకంగా డిస్‌కనెక్ట్ చేయడం వంటి వాటిని ఖండిస్తూ తీర్మానాలు చేయడం వంటివి వున్నాయి. 23 తీర్మానాలతో పాటు ఎంజీఆర్ సతీమణి, మాజీ సీఎం వీఎన్ జానకీ రామచంద్రన్ 100వ జన్మదిన వేడుకలను అన్నాడీఎంకే ఘనంగా నిర్వహించాలని సమావేశంలో ప్రత్యేక తీర్మానం చేశారు.