ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ విమర్శలకు మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు, బీజేపీ రాజ్యసభ సభ్యులు నీరజ్ శేఖర్ కౌంటర్ ఇచ్చారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ విమర్శలకు మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు, బీజేపీ రాజ్యసభ సభ్యులు నీరజ్ శేఖర్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్టీలకు అతీతంగా గతంలో ప్రధానులుగా పనిచేసినవారికి గౌరవం ఇస్తున్నారని చెప్పారు. వివరాలు.. ఢిల్లీలోని తీన్ మూర్తి భవన్ ప్రాంగణంలో ఉన్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీకి ప్రధానమంత్రుల మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీగా పేరు మార్చబడింది. అయితే ఈ నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్విట్టర్ వేదికగా మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఏ చరిత్ర లేని వారు ఇతరుల చరిత్రను చెరిపివేయబోతున్నారని విమర్శించారు. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ పేరును మార్చే దురదృష్టకరమైన ప్రయత్నం.. ఆధునిక భారతదేశానికి రూపశిల్పి, ప్రజాస్వామ్యానికి నిర్భయమైన కాపలాదారు అయిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ వ్యక్తిత్వాన్ని తక్కువ చేయదని అన్నారు. ఇది బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ల నీచ మనస్తత్వాన్ని, నియంతృత్వ వైఖరిని మాత్రమే తెలియజేస్తోందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం మరుగుజ్జు ఆలోచన భారతదేశానికి ‘‘జవహర్ ఆఫ్ హింద్’’ భారీ సహకారాన్ని తగ్గించలేకపోయిందని అన్నారు.
అయితే మల్లికార్జున ఖర్గే ట్వీట్‌పై స్పందించిన నీరజ్ శేఖర్.. తన తండ్రి, మాజీ ప్రధాని చంద్రశేఖర్ ఎప్పుడూ దేశ ప్రయోజనాల కోసం పనిచేశారని అన్నారు. ఆయన కాంగ్రెస్‌తో కలిసి పనిచేశాడని.. కానీ వారు ఒక రాజవంశాన్ని మించి చూడలేదని చురకలు అంటించారు. ప్రస్తుతం ప్రధాని మోడీ పార్టీలకు అతీతంగా ప్రధాన మంత్రులను సత్కరించినప్పుడు.. కాంగ్రెస్ ఇబ్బందిగా ఫీల్ అయి రెచ్చిపోతుందని ఎద్దేవా చేశారు. ఇది భయంకరమైన వైఖరి అని పేర్కొన్నారు.
‘‘నేను కాంగ్రెస్ నాయకులందరినీ అడగాలనుకుంటున్నాను.. వారు ప్రధానమంత్రి మ్యూజియంకు ఎన్నిసార్లు వెళ్లారు? సోనియా జీ లేదా రాహుల్ జీ ఎప్పుడైనా అక్కడికి వెళ్లారా? ఒక రాజవంశానికి మించిన వ్యక్తులు మన దేశాన్ని నిర్మించారనే వాస్తవాన్ని అంగీకరించలేని వారి అసమర్థత వికృతమైనది. దీనిని నిస్సందేహంగా ఖండించాలి.
ప్రధాన మంత్రులను గౌరవించడం మరచి.. కాంగ్రెస్, వారి రాజవంశం తమ వంశానికి చెందని ప్రధాన మంత్రులను అవమానించాయి. నరసింహారావు పట్ల వ్యవహరించిన తీరు మన రాజకీయ చరిత్రలో అత్యంత అవమానకరమైన అధ్యాయాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. ప్రధానమంత్రి మ్యూజియంలో పార్టీ శ్రేణులతో సంబంధం లేకుండా ప్రతి ప్రధానికి గౌరవం ఉంది. వారి సహకారం హైలైట్ చేయబడింది. ఇది ప్రధాని నరేంద్రమోదీ రాజనీతిజ్ఞతను తెలియజేస్తోంది’’ అని నీరజ్ శేఖర్ పేర్కొన్నారు.
ఇక, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ (ఎన్‌ఎంఎంఎల్) ప్రత్యేక సమావేశంలో దాని పేరును మార్చాలని నిర్ణయించినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. సొసైటీ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో తన ప్రసంగంలో రాజ్‌నాథ్ సింగ్ పేరు మార్పు ప్రతిపాదనను స్వాగతించారు. ఈ సంస్థ జవహర్‌లాల్ నెహ్రూ నుంచి నరేంద్ర మోడీ వరకు ప్రధాన మంత్రులందరి సహకారాన్ని, వారు ఎదుర్కొన్న వివిధ సవాళ్లకు వారి ప్రతిస్పందనలను దాని కొత్త రూపంలో ప్రదర్శిస్తుందని అన్నారు.
ప్రధానమంత్రులను ఒక సంస్థగా అభివర్ణిస్తూ.. వివిధ ప్రధాన మంత్రుల ప్రయాణాన్ని ఇంద్రధనస్సు వివిధ రంగులతో పోల్చారు. ‘‘ఇంద్రధనస్సును అందంగా మార్చడానికి అన్ని రంగులు దామాషా ప్రకారం ప్రాతినిధ్యం వహించాలి’’ అని పేర్కొన్నారు.
