బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కి ఊహించని షాక్ తగిలింది. గో బ్యాక్ సీఎం అంటూ స్థానికులు నినాదాలు చేశారు. ఇంతకీ మ్యాటరేంటంటే... ఇటీవల మెదడు వ్యాపు వ్యాధి కారణంగా బిహార్ లోని ముజఫర్ నగర్ లో దాదాపు 100మంది చిన్నారులు కన్నుమూశారు. ఈ క్రమంలో ఆ  చిన్నారుల కుటుంబసభ్యులను పరామర్శించేందుకు మంగళవారం సీఎం నితీశ్ కుమార్ శ్రీ కృష్ణ మమెడికల్ హాస్పిటల్ కి వెళ్లారు. కాగా ఆయనకు అక్కడ చుక్కెదురైంది.

 సీఎం నితీశ్ రాకను కొంద‌రు అడ్డుకున్నారు. వెన‌క్కి వెళ్లాలంటూ నినాదాలు చేశారు. అక్క‌డ ఉన్న డాక్ట‌ర్లు, పేషెంట్ల‌తో నితీశ్ మాట్లాడారు. మెద‌డువాపు ప్ర‌బ‌ల‌కుండా ఉండేందుకు నితీశ్ ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కొంద‌రు బాధితులు ఆరోపించారు. అయితే మెద‌డువాపు వ్యాధి గురించి అవగాహన లేకపోవడంతో ఎలాంటి చికిత్స అందించాలో తెలియడం లేదని, దీంతో మృతుల సంఖ్య పెరుగుతున్నదని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సైతం ఒప్పుకున్నారు. 

ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్దన్  ఢిల్లీలో ఎయిమ్స్, ఐసీఎంఆర్‌కు చెందిన ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పిల్లల మరణాలపై క్షేత్రస్థాయిలో పరిశోధన జరిపేందుకు మరో అత్యున్నత స్థాయి బృందాన్ని ముజఫర్‌పూర్‌కు పంపించాలని ఆదేశించారు.