Bihar: నితీశ్ యూటర్న్ బీజేపీకి కలిసొస్తుందా? బిహార్ సర్వేలో సంచలన విషయాలు
బిహార్ సీఎం నితీశ్ కుమార్ యూటర్న్ తీసుకోవడం బీజేపీకి కలిసి వస్తుందా? లేదా? అనే అంశంపై ఓ సర్వే జరిగింది. దీనిపై సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నితీశ్ కుమార్ యూటర్న్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్ సభ ఎన్నికల వరకు బీజేపీకి లబ్ది చేకూరనున్నట్టు సర్వే పేర్కొంది.
Nitish Kumar: బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఇటీవలే ఆర్జేడీ - కాంగ్రెస్ మహాగట్‌బంధన్ నుంచి బయటికి వచ్చి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరారు. దీంతో బిహార్‌లో మహాగట్‌బంధన్ నుంచి ఎన్డీయేలోకి మరోసారి జంప్ అయ్యారు. ఇది ప్రతిపక్షాన్ని చావుదెబ్బ తీసింది. బిహార్ రాష్ట్రంలో మహాగట్‌బంధన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారడమే కాదు.. ఇండియా కూటమి మనుగడ కూడా ప్రశ్నార్థకం చేసింది. నితీశ్ కుమార్ ఎన్డీయే చేరడం మూలంగా ప్రతిపక్షాలకైతే గట్టి దెబ్బ పడింది. ఇది పరోక్షంగా బీజేపీ కూటమికి రాష్ట్రస్థాయిలో.. జాతీయ స్థాయిలోనూ కలిసి వచ్చేదే. నితీశ్ కుమార్ ఎన్డీయే చేరడం మూలంగా ప్రత్యక్షంగా బీజేపీకి లాభిస్తుందా? నితీశ్ చేరికతో బీజేపీ సీట్లు పెరిగే అవకాశం ఉందా? అనే అంశాలకు బిహార్‌లో నిర్వహించిన సర్వే సమాధానాలు ఇచ్చింది.
ఈ సర్వే ప్రకారం నితీశ్ కుమార్ ఎన్డీయేలో చేరికతో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీకి లబ్ది చేకూరనుంది. ఈ సర్వే సుమారు 4,000 మంది నుంచి సమాధానాలు తీసుకుని క్రోడీకరించారు. ఈ సర్వేలో పాల్గొన్న 53 శాతం మంది వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జేడీయూకు ఓటేస్తామని చెప్పారు. కాగా, 23 శాతం మంది మాత్రం ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికే ఓటు వేస్తామని తెలిపారు. మిగిలిన వారు వేరే పార్టీలకు మద్దతు ఇస్తామని, ఇందులోనే మరికొందరు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
Also Read : Indians: లడాఖ్‌లో గొర్రెల కాపర్ల దెబ్బకు తోకముడిచిన డ్రాగన్ ఆర్మీ
ఒక వేళ నితీశ్ కుమార్ ఎన్డీయేలోకి రాకుండా.. జేడీయూ-ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమి సుస్థిరంగా ఉండి ఉంటే 35 శాతం మంది ఆ మహాగట్‌బంధన్‌కే ఓటు వేసేవారని వివరించారు. అంతే 35 శాతం మంది ఎన్డీయేకు ఓటు వేసేవారని తెలిపారు. కానీ, నితీశ్ యూటర్న్ తర్వాత ఎన్డీయేకు ఎక్కువ శాతం మంది మొగ్గు చూపినట్టు అర్థం అవుతున్నది. నెక్ టు నెక్ ఉండే పోటీని.. నితీశ్ యూటర్న్‌తో ఎన్డీయే వైపు పోటీ మొగ్గిందని తెలుస్తున్నది.
నితీశ్ రాకను ఎన్డీయే ఓటర్లు చాలా మంది అంగీకరించారు. నితీశ్ రాకతో బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. లోక్ సభ ఎన్నికల్లోనూ లబ్ది చేకూరుతుందని ఈ సర్వే వెల్లడించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో 54 శాతం మంది బీజేపీ-జేడీయూకు ఓటు వేస్తారని, 27 శాతం మంది ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి ఓటు వేస్తారని ఈ సర్వేలో చెప్పారు.
36 శాతం ప్రతిపక్ష కూటమి ఓటర్లు కూడా లోక్ సభ ఎన్నికల్లో నితీశ్ కుమార్‌కే ఓటు వేస్తామని పేర్కొనడం గమనార్హం. అంటే.. కూటమి మార్చినా నితీశ్ కుమార్‌పై సానుకూల అభిప్రాయాలే ఉన్నాయి.