కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా విపక్షాల ఐక్యత కోసం జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి  నితీశ్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో నితీష్ కుమార్ భేటీకి మాత్రం కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా లేనట్టుగా తెలుస్తోంది.

హైదరాబాద్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా విపక్షాల ఐక్యత కోసం జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ధీటుగా ఎదుర్కొనేలా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు పలు విపక్ష పార్టీల నేతలతో నితీశ్ కుమార్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో నితీశ్ కుమార్ భేటీపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది. 

విపక్షాల ఐక్యతలో భాగంగా నితీష్ కుమార్.. ఇప్పటికే టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లతో నితీష్ కుమార్ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలలో విపక్షాల ఐక్యత, బీజేపీని ఎదుర్కొవాల్సిన అవశ్యకత, పొత్తులు, ఉమ్మడి కార్యాచరణ తదితర అంశాలపై చర్చలు జరుపుతున్నారు. తాజాగా సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలతో నితీష్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విపక్ష ఐక్యత ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై చర్చించినట్టుగా తెలుస్తోంది. 

అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో నితీష్ కుమార్ భేటీకి మాత్రం కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా లేనట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కేసీఆర్‌తో నితీశ్ కుమార్ భేటీ జరిగితే.. అది తమ పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అదే సమయంలో కర్ణాటకలో విజయంతో జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చి తీరుతామనే ధీమాతో ఉంది. 

అంతేకాకుండా.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌లో తన పార్టీని వీలినం చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే చాలా కాలం పాటు బీజేపీ అనకూల వైఖరితో ఉన్న కేసీఆర్.. కేంద్రంలో అధికారంలో లేకున్న కాంగ్రెస్‌పై పలు సందర్భాల్లో అనవసరమైన విమర్శలు గుప్పించారనే భావలో కూడా ఉన్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ కొలువుదీరిన వేడుకకు.. విపక్ష పార్టీలకు ఆహ్వానాలు పంపిన కేసీఆర్‌కు ఆహ్వానం పంపించలేదని తెలుస్తోంది. 

అయితే విపక్షాల ఐక్యతలో భాగంగా బీఆర్ఎస్‌ను కూడా కలుపుకుపోవాలని అన్ని పార్టీలు కోరితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని నితీశ్ కుమార్‌కు కూడా చెప్పినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే.. కేసీఆర్‌తో భేటీ విషయంలో నితీశ్ ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారని చెబుతున్నారు. 

మరోవైపు కేసీఆర్ కూడా కాంగ్రెస్‌తో జట్టు కట్టేందుకు సిద్దంగా లేడని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న కేసీఆర్.. బీజేపీయేతర, కాంగ్రెసేతర పక్షాలతో కూటమి ఏర్పాటకు తన వంతు ప్రయత్నాలు కూడా చేశారు. ఈ క్రమంలోనే పలువురు విపక్ష నేతలతో సమావేశాలు నిర్వహించారు. అయితే ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలించిన దాఖలాలు కనిపించలేదు. ఇక, ప్రస్తుతానికైతే మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ దృష్టి సారించారు.