న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికను ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్నట్టు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రకటించారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ పదవికి పోటీ చేసేందుకు ఈ నెల 8వ తేది మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు విధించినట్టు ఆయన తెలిపారు.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ పీజే కురియన్ పదవీకాలం ముగియడంతో డిప్యూటీ ఛైర్మెన్ పదవిని భర్తీ చేయనున్నారు. రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. 123 మంది సభ్యుల మద్దతు ఉంటే డిప్యూటీ ఛైర్మెన్ పదవి దక్కనుంది.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ పదవి కోసం పార్టీలు వ్యూహలు రచిస్తున్నాయి.  జేడీ(యూ) నేత  హరివంశ్ నారాయణ్ సింగ్ ను రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ గా  ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాలున్నట్టు ప్రచారం సాగుతోంది.

బీహార్ లో అధికారంలో ఉన్న నితీష్ కుమార్ పార్టీ ప్రస్తుతం బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతోంది.దీంతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ పదవి ఆ పార్టీకి కట్టబెట్టే అవకాశాలున్నట్టు సమాచారం.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ పదవి కోసం అధికార, విపక్షాలు వ్యూహలను రచిస్తున్నాయి. విపక్షాల తరపున  ఓ అభ్యర్ధిని బరిలోకి దింపే అవకాశం ఉంది. సుఖేందర్ శేఖర్ రాయ్  టీఎంసీ ఎంపీ. ఆయనను విపక్షాల అభ్యర్ధిగా బరిలోకి దింపే అవకాశం లేకపోలేదు. 

అధికార ఎన్డీఏ  హరినివాస్ నారాయణ్ సింగ్  ను బరిలోకి దింపనున్నట్టు సమాచారం. హరినివాస్ నారయణ సింగ్ మాజీ జర్నలిస్ట్. ఆయన 2014 నుండి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన పీజే కురియన్  2012 నుండి  రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ గా కొనసాగుతున్నాడు.  అయితే  కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో 51 మంది సభ్యులున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి  స్వంతంగా  అభ్యర్ధిని బరిలోకి దించి  విజయం సాధించాలంటే ఇతర పార్టీల మీద ఆధారపడాల్సిందే.బీజేడీ, టీఆర్ఎస్ పార్టీల మీద ఆధాపడాల్సిందే.అయితే ఈ రెండు పార్టీలు అధికార పార్టీకి కొంత సన్నిహితంగా ఉంటున్నట్టు సంకేతాలు ఇస్తున్నాయి.