Asianet News TeluguAsianet News Telugu

ఆరేండ్ల త‌ర్వాత సోనియా గాంధీతో నితీష్ కుమార్, లాల్ ప్ర‌సాద్ యాద‌వ్ ల భేటీ

Opposition Meet: దాదాపు ఆరేండ్ల తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలవనున్నారు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) వ్యవస్థాపకుడు దివంగత చౌదరి దేవిలాల్ జయంతి సందర్భంగా ఐఎన్‌ఎల్‌డి నేత ఓపీ చౌతాలా ఆధ్వర్యంలో ఫతేహాబాద్ జిల్లాలో జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు ఇరువురు నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.
 

Nitish Kumar, Lal Prasad Yadav meet Sonia Gandhi after six years
Author
First Published Sep 25, 2022, 9:46 AM IST

 

Sonia-Nitish -Lalu Prasad Meet: కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ)కి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్ష పార్టీలు ఏకం అవుతున్నాయి. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి మొత్తం ప్రతిపక్షాలను ఏకం చేయాలనే లక్ష్యంతో జేడీ(యూ) నాయ‌కుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాద‌వ్ లు మ‌రో ముంద‌డుగు వేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఆదివారం నాడు క‌ల‌వ‌నున్నారు. దాదాపు ఆరేండ్ల త‌ర్వాత ఈ ఇద్ద‌రు నేత‌లు సోనియాను దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌ల‌వనున్నారు. ఐదేళ్ల తర్వాత మూడు పార్టీల మధ్య ఇదే తొలి సమావేశం కావడం గమనార్హం. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) వ్యవస్థాపకుడు దివంగత చౌదరి దేవిలాల్ జయంతి సందర్భంగా ఐఎన్‌ఎల్‌డి నేత ఓపీ చౌతాలా ఆధ్వర్యంలో ఫతేహాబాద్ జిల్లాలో జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు ఇరువురు నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.

నితీష్ కుమార్‌తో కలిసి ఢిల్లీలో సోనియా గాంధీని కలుస్తానని మంగళవారం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ మీడియాకు తెలిపారు. "అందరూ అప్రమత్తంగా ఉండాలి. 2024లో బీజేపీని కూకటివేళ్లతో పెకిలించి వేయాలి. త్వరలో ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీని కలుస్తాను..  దేశ‌వ్యాప్త భార‌త్ జోడో యాత్ర క్ర‌మంలో పాదయాత్ర పూర్తయిన తర్వాత రాహుల్ గాంధీని కూడా కలుస్తాను" అని ఆర్జేడీ చీఫ్ అన్నారు. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికలలో ప్రజల ఓట్లను కోరేందుకు విశ్వసనీయమైన ముఖం.. ప్రజా ఉద్యమం అవసరం అని రాజ‌కీయ ఎన్నిక‌ల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలవడం వ‌ల్ల పెద్ద‌గా మార్పులు చోటుచేసుకోవంటూ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఇలాంటి సమావేశాలను ప్రతిపక్షాల ఐక్యతగానో, రాజకీయ అభివృద్ధిగానో చూడలేమని అన్నారు. 

కాగా, ఇటీవ‌ల బీజేపీ నేతృత్వంలోని ఏన్డీయే కూట‌మికి సీఎం నితీష్ కుమార్ గుడ్ బై చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్, ఆర్జేడీ స‌హా ఇత‌ర పార్టీల‌తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించడానికి ప్ర‌తిప‌క్ష పార్టీలు ఒక్కటిగా ముందుకు సాగాల్సిన అవ‌స‌రం వుంద‌ని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నితీష్ కుమార్.. ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కుల‌తో వ‌రుస స‌మావేశాలు జ‌రుపుతున్నారు. అంత‌కుముందు తన ఢిల్లీ పర్యటనలో ఆయ‌న.. కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లతోనూ సమావేశమయ్యారు.

బీహార్‌లో "మ‌హాగ‌ట్బంధ‌న్" ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీతో పొత్తును తెంచుకుని, తేజస్వి యాదవ్‌కి చెందిన రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, ఇతర పార్టీలతో చేతులు కలిపిన తర్వాత నితీష్ కుమార్ ప్రతిపక్ష నాయకులతో వ‌రుస‌గా సమావేశమయ్యారు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కూడా బీహార్‌లో పర్యటించి ప్రతిపక్షాల ఐక్యతను సాధించే ప్రయత్నాల్లో భాగంగా నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌లను కలిశారు. ఇదిలా ఉండగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో నితీష్‌ కుమార్‌ను ప్రధాని అభ్యర్థిగా పేర్కొంటూ వివిధ పోస్టర్లు గత నెలలో పాట్నాలో కనిపించాయి. జేడీ(యూ) వేసిన పోస్టర్లలో సుపరిపాలన అందిస్తామ‌ని హామీ ఇస్తూ, 'ప్రదేశ్ మే దిఖా, దేశ్ మే దిఖేగా ' అనే నినాదం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios