నితీష్ కుమార్ ఈ నెల 25వ తేదీన అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్నారు. అయితే, అసెంబ్లీ స్పీకర్‌గా ఇంకా బీజేపీ నేతలనే ఉన్నారు. ఈ నెల 24వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనూ నితీష్ కుమార్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది.
పాట్నా: బిహార్‌లో రాజకీయాలు చివరి దశకు చేరుకున్నాయి. బీజేపీ నుంచి వేరువడి ఆర్జేడీతో నితీష్ కుమార్ చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఈ ప్రభుత్వానికి కీలకమైన విశ్వాస పరీక్ష మిగిలి ఉన్నది. నితీష్ కుమార్ ఈ విశ్వాస పరీక్షను రెండు వారాల తర్వాతే అని నిర్ణయించుకున్నారు. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.
ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చాక రాజీనామా చేసిన నితీష్ కుమార్ ఇప్పుడు ఆర్జేడీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీన ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లోనే జేడీయూ, ఆర్జేడీ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి ఉన్నది. అయితే, అసెంబ్లీ స్పీకర్ మాత్రం ఇప్పటికీ ఇంకా బీజేపీ నుంచి ఎన్నుకున్న నేతనే ఉన్నారు.
నితీష్ కుమార్ దగ్గర మెజార్టీ మార్క్ కంటే ఎక్కువ మంది శాసన సభ్యుల మద్దతు ఉన్నది. 243 స్థానాలు గల బిహార్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ మార్క్ 122. ఆర్జేడీ, ఇతర పార్టీల మద్దతుతో ప్రస్తుతం నితీష్ కుమార్‌కు 164 మంది సభ్యుల సపోర్ట్ ఉన్నది. కాబట్టి, బీజేపీ స్పీకర్ ఉన్నప్పటికీ ఆయన సులువుగా విశ్వాస పరీక్షను నెగ్గవచ్చు. కానీ, నితీష్ కుమార్ రిస్క్ చేయాలని అనుకోవడం లేదు. అందుకే విశ్వాస పరీక్షకు ముందే స్పీకర్‌ను మార్చుకోవాలని భావిస్తున్నారు.
టెక్నికల్‌గా చూస్తే సమావేశాలకు గవర్నర్ పిలుపు ఇస్తారు. కానీ, ఆయన కూడా ప్రభుత్వ సిఫారసుల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది.
మహాఘట్‌బంధన్‌కు చెందిన 55 ఎమ్మెల్యేలు స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాపై అనర్హత తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ, రూల్స్ ప్రకారం, ఈ తీర్మానం పంపిన 14 రోజుల తర్వాతే అసెంబ్లీలో దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ సెషన్స్ 24వ తేదీన ప్రారంభం కానున్నాయి. కాబట్టి, స్పీకర్‌ను తొలగించే ప్రక్రియ వారికి ఇబ్బందిగా ఏమీ లేదు. ఈ నెల 24వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ పై అనర్హత మోషన్‌పై ఓటింగ్ నిర్వహిస్తారు. నూతన స్పీకర్ నియామకం తర్వాతి రోజే అంటే ఆగస్టు 25వ తేదీన నితీష్ కుమార్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొంటుంది.
ఈ వ్యవహారానికి ముందే స్పీకర్ రాజీనామా చేసే అవకాశమూ లేకపోలేదు. అయితే, ఆయన బీజేపీ సూచనలతో నడుచుకోనునన్నారు.
జేడీయూ, ఆర్జేడీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం స్పీకర్ ఆర్జేడీ నుంచి ఎన్నికవ్వాలి.
