కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవితంలోని నాయకులు ఎన్నికల్లో ఓటమికి కూడా బాధ్యత వహించాలని తాను చేసిన వ్యాఖ్యలను రాజకీయ ప్రత్యర్థులు, మీడియా వక్రీకరించారని ఆయన మండిపడ్డారు.

బీజేపీ హైకమాండ్‌కు, తనకు మధ్య చిచ్చు పెట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరు ప్రతిపక్షనేతలు, మీడియాలోని ఓ వర్గం తన మాటలను వక్రీకరించేందుకు కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నారని గడ్కరీ అన్నారు.

అయితే బీజేపీని, తనను అప్రతిష్టపాలు చేయడానికి వారు చేస్తున్న కుట్రలు సాగవని ఆయన హెచ్చరించారు. కాగా, ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో ఉన్న నాయకులను ఓటమిని, వైఫల్యాలను నాయకులు అంగీకరించాలని వ్యాఖ్యానించారు.

అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన కొద్దిరోజులకే నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ హైకమాండ్‌ని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ దేశ వ్యాప్తంగా కథనాలు వచ్చాయి.