కాంగ్రెస్ కు నితిన్ గడ్కరీ లీగల్ నోటీసులు.. ఎందుకంటే ?
కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ (Jairam Ramesh) కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) లీగల్ నోటీసులు పంపించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఇంకా స్పందించలేదు. అసలెందుకు ఈ నోటీసులు పంపించారంటే ?
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాంగ్రెస్ పార్టీకి లీగల్ నోటీసులు పంపించారు. ఓ ఇంటర్వ్యూలో తన మాట్లాడిన మాటలను వక్రీకరించి, కొంత భాగాన్ని మాత్రమే షేర్ చేసినందుకు, పార్టీలో చీలకలు, అపఖ్యాతి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. వెంటనే ఆ వీడియోను తొలగించాలని, క్షమాపణ కోరాలని ఆయన పంపిన లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే ?
ఇండియా టుడే సిస్టర్ ఛానల్ లల్లాంటాప్ కు ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే అందులోని 19 సెకన్ల వీడియో క్లిప్పింగ్ ను కట్ చేసి షేర్ చేసి కాంగ్రెస్ తన అధికారిక ‘ఎక్స్’ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. దీనిపై గడ్కరీ సీరియస్ అయ్యారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్ లకు లీగల్ నోటీసులు పంపారు. ఇంటర్వ్యూ సందర్భాన్ని, అర్థాన్ని దాచిపెట్టి తనకు అపఖ్యాతి తీసుకురావాలని, పార్టీలో చీలికలు సృష్టించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని ఆరోపించారు. తన ఇంటర్వ్యూను వక్రీకరించారని, కాంగ్రెస్ ‘ఎక్స్’ వాల్ పై వీడియోను అప్ లోడ్ చేశారని, దీని వల్ల అర్థం మొత్తం మారిపోయిందని నోటీసుల్లో పేర్కొన్నారు.
కాగా.. కాంగ్రెస్ షేర్ చేసిన 19 సెకన్ల వీడియోలో నితిన్ గడ్కరీ పేదలు, రైతులు, గ్రామస్తుల గురించి మాట్లాడారు. గ్రామాలు, పేదలు, కూలీలు, రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని... గ్రామాలకు మంచి రోడ్లు లేవు, తాగడానికి నీరు లేదు, మంచి ఆసుపత్రులు లేవు, మంచి పాఠశాలలు లేవని అందులో చెబుతున్నారు. అయితే వాస్తవానికి గడ్కరీ గ్రామీణ-పట్టణ వలసల గురించి, రైతుల జీవితాలను మెరుగుపరచడానికి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల గురించి మాట్లాడారు. కానీ అందులో కొంత భాగాన్ని కత్తిరించి అప్ లోడ్ చేశారు.
దీంతో నితిన్ గడ్కరీ లీగల్ నోటీసులు పంపించారు. ‘‘ ఇంటర్వ్యూ గురించి పూర్తిగా తెలిసినప్పటికీ.. సంభాషణ జరిగిన సందర్భోచిత అర్థాన్ని దాచిపెట్టి, ఉద్దేశపూర్వకంగా హిందీ శీర్షికలు పెట్టి వీడియోను పోస్ట్ చేశారు. ఇది నా ప్రతిష్టను దెబ్బతీయడానికి దురుద్దేశంతో చేసిన పనే’’ అని లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టును తొలగించాలని, మూడు రోజుల్లో నితిన్ గడ్కరీకి లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని ఆ లీగల్ నోటీసు కాంగ్రెస్ నేతలను ఆదేశించింది. అలా చేయకపోతే సివిల్, క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆ నోటీసులు హెచ్చరించాయి.