తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ కి మోదీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ  అత్యధిక స్థానాలు గెలుచుకొని మళ్లీ అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా... తాజాగా ప్రధాని మోదీ సహా... 57మంది కొత్త మంత్రులు బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి నిర్మలా సీతారామన్ పేరు ప్రముఖంగా మార్మోగిపోతోంది. అందుకు కారణం ఆమెకు కేటాయించిన శాఖే. 

ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రక్షణ శాఖ మంత్రిగా పూర్తి స్థాయిలో సేవలు అందించిన మహిళగా పేరుకెక్కిన ఈమె ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించారు. భారత దేశ ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులయ్యారు. అలాగే కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా చూసుకోనున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఆర్థిక మంత్రిగా ఈ ఘనత దక్కించుకున్న మహిళగా నిలిచారు. ఇందిరా గాంధీ 1970-71లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 

విచిత్రం ఏమిటంటే... ఇందిరాగాంధీ తర్వాత  రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహిళ కూడా నిర్మలాసీతారామే. ఇప్పుడు ఆమెకు ఆర్థిక శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు.

నిర్మలా సీతా రామన్ 1959 ఆగస్టు 18వ తేదీన తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించారు.  మద్య తగరతి కుటుంబంలో జన్మించిన ఆమె నిర్మలా సీతారామన్ తమిళనాడులోని తిరుచిరపల్లిలో ఉన్న సీతాలక్ష్మీ రామస్వామి కాలేజ్‌లో ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి ఎంఫిల్ పట్టా పొందారు.

ఆమె మొదట ప్రెస్ వాటర్ హౌస్ కూపర్స్ ఆడిటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్ గా పని చేశారు. 2003-2005 మధ్య కాలంలో సీతా రామన్.. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా పని చేశారు. ఆమె భర్త తరపు కుటంబం కాంగ్రెస్ పార్టీ తరపు వారైనప్పటికీ.. ఆమె రాజీకీయ అడుగులు మాత్రం బీజేపీ వైపే వేశారు.

నిర్మలా సీతారామన్ ఇదివరకే ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. వాణిజ్య శాఖ మంత్రిగా కూడా కొనసాగారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యులుగా కూడా ఉన్నారు. 

2014లో బీజేపీ అధికారంలో కి వచ్చినప్పుడు ఆమెకు రక్షణ శాఖ అప్పగించారు. ఈసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక శాఖ అప్పగించారు.