ఏడు సంవత్సరాలుగా తన కూతురికి జరిగిన అన్యాయం కోసం  ఆ తల్లి పోరాడుతూనే ఉంది. దిశ ఘటన తర్వాత మరోసారి నిర్భయ దోషుల కేసు విషయంలో చలనం వచ్చింది. గత కొద్ది రోజులుగా నిర్భయ దోషులకు ఉరిశిక్ష వేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే... నేడు ఆ కేసును మరోసారి ఢిల్లీ కోర్టు పరిశీలించింది. 

కాగా... కోర్టు నిర్భయ నిందితుల డెత్ వారెంట్ వాయిదా వేయడంతో నిర్భయ తల్లి కోర్టులోనే కన్నీటి పర్యంతమయ్యారు.క్షమాభిక్ష దరఖాస్తు కోసం న్యాయమూర్తి నిందితులకు గడువు ఇవ్వడంపై నిర్భయ తల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఎక్కడికి వెళ్లినా... అందరూ దోషుల హక్కుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని.. తమకు మాత్రం హక్కులు ఉండవా అని ఆమె ప్రశ్నించారు. ఆమె వేసిన ప్రశ్నకు న్యాయమూర్తి స్పందించారు. ఆమె ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని చెప్పిన న్యాయమూర్తి... ఆమెపై తనకు సానుభూతి ఉందని చెప్పారు.

ఈ నలుగురు దోషుల కారణంగా ఓ యువతి ప్రాణాలు కోల్పోయినప్పటికీ.. ఈ దోషులకు హక్కులు ఉంటాయని ఆయన ఆమెకు వివరించారు. తాము చట్టాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు.

నిర్భయ దోషులకు సంబంధించి క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేస్తున్నారా? అని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆరా తీసింది. కాగా, అత్యాచార కేసుల్లో మృగాళ్లకు క్షమాభిక్ష అవసరం లేదని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషులు క్షమాభిక్షకు వెళ్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ దోషులు క్షమాభిక్షకు వెళ్తే ఉరిశిక్ష మరి కాస్త ఆలస్యం కావచ్చు. లేనిపక్షంలో వారం రోజుల గడువు తర్వాత వారిని ఉరితీసే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా  ‘నిర్భయ’ హత్యాచారం కేసులో దోషి అక్షయ్‌ తరపున దాఖలైన రివ్యూ పిటిషన్‌‌పై బుధవారం విచారించిన సుప్రీం కోర్టు సంచలన తీర్పును ప్రకటించింది. రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని, ఉరిశిక్షపై పునఃసమీక్షించబోమని సుప్రీం త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.