ఉత్తర ప్రదేశ్ లో నిర్భయ ఘటన పునరావృతం అయ్యింది. ఓ నడివయసు మహిళను కామాంధులు కిరాతకంగా హత్యాచారం చేశారు. ఉత్తరప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న అత్యాచారపర్వాలు మహిళల పాలిట శాపాలుగా మారుతున్నాయి. 

ఉత్తరప్రదేశ్‌లో హథ్రాస్‌ ఉదంతం మరవకముందే బదూన్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. నడి వయస్కురాలైన ఓ మహిళపై కామాంధులు అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలిని చిత్రహింసలకు గురిచేసి ఆమె మరణానికి కారణమయ్యారు. ఈనెల 3వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైన విషయాలు మృగాళ్ల క్రూరత్వానికి అద్దం పడుతున్నాయి. మేవాలి గ్రామంలో ఆదివారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.  ప్రైవేటు భాగాల్లో ఐరన్‌ రాడ్డుతో దాడి చేసి.. పక్కటెముకలు, కాలు విరిగేలా పశువుల్లా ప్రవర్తించారు. 

ఈ ఘటనలో బాధితురాలి ఊపిరితిత్తులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. తలకు బలమైన గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె కన్నుమూసింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

నిందితులు హంత్‌ బాబా సత్యనారాయణ, అతడి అనుచరుడు వేద్‌రాం, డ్రైవర్‌ జస్పాల్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారి ఆచూకీ కనుగొనేందుకు లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. బదూన్‌ ఎస్‌ఎస్పీ సంకల్ప్ శర్మ ఘటనాస్థలిని పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను అరెస్టు చేసి, శిక్ష పడేలా చేస్తామని పేర్కొన్నారు.