పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై నిర్భయ తల్లి ఆశా దేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగికదాడి పట్ల సున్నిహితంగా వ్యవహరించాలని, ఇంత సున్నితత్వం లేకుండా మాట్లాడుతున్న మమతా బెనర్జీకి సీఎంగా కొనసాగే అర్హత లేదని విమర్శలు గుప్పించారు. ఆమె సాటి మహిళ అయి ఉండీ హోదాకు తగినట్టుగా వ్యవహరించలేదని అన్నారు. 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలో ఓ మైనర్‌పై జరిగిన లైంగికదాడి గురించి సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపుతున్నాయి. నిర్భయ తల్లి ఆశా దేవి సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. మమతా బెనర్జీ తీరుపై మండిపడ్డారు. ఒక లైంగికదాడి బాధితురాలి పట్ల ఆమె మాట్లాడిన తీరు చూస్తే.. ఆమె ముఖ్యమంత్రి పదవికి అనర్హురాలు అని అనిపిస్తున్నదని పేర్కొన్నారు. లైంగికదాడి పట్ల సున్నితంగా మాట్లాడని ఆమెకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. ఒక మహిళ అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఆమె హోదాకు తగిన విధంగా వ్యవహరించడం లేదు అని విమర్శించారు.

నదియా జిల్లాలో 14 ఏళ్ల మైనర్‌పై స్థానిక టీఎంసీ నేత కొడుకు లైంగికదాడికి పాల్పడ్డటు కథనాలు వచ్చాయి. అనంతరం ఆమెకు రక్తస్రావం జరిగిందని, ఆ తర్వాత ఆమె ఆరోగ్యం విషమించి మరణించినట్టు తల్లిదండ్రులు చెప్పారు. ఈ ఘటనపై మమతా బెనర్జీ స్పందిస్తూ చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి.

ఆమె రేప్ జరిగిందనే మాటనే ప్రశ్నిస్తూ మాట్లాడారు. ఈ కథలో ఆ మైనర్ అమ్మాయి రేప్ వల్ల మరణించినట్టు రాశారని, అసలు దాన్ని రేప్ అనవచ్చునా? అని అడిగారు. ఆమె అప్పటికే గర్భందాల్చి ఉన్నదా? ఆమె ప్రేమ వ్యవహారం నడిపిందా? ఇలాంటి విషయాలను ఆరా తీశారా? అని తాను పోలీసులను అడిగానని చెప్పారు. పోలీసులు ఇప్పటికే ఈ కేసులో అరెస్టు చేస్తున్నారని, అయితే, ఆ అమ్మాయి అదే అబ్బాయితో ప్రేమ వ్యవహారం నడిపించిందని తనకు చెప్పారని వివరించారు.

వారిద్దరి మధ్య ప్రేమ అనే సంబంధం ఉన్నదని, అమ్మాయి తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలుసు అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు తాను వారిని ఆపడం తగునా? అని ప్రశ్నించారు. ఇది యూపీ కాదని, ఇక్కడ తాము లవ్ జీహాద్‌లు చేయబోమని తెలిపారు. ఇది వారి వ్యక్తిగత స్వేచ్ఛ అని చెప్పారు. కానీ, ఇందులో ఏదైనా తప్పుడు వ్యవహారాలు ఉంటే పోలీసులు తప్పకుండా దోషులను పట్టుకుని తీరుతారని అని వివరించారు. ఇప్పటికే ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు.

ఈ ఘటనపై బాలిక తండ్రి మాట్లాడుతూ, ఏప్రిల్ 4వ తేదీన తన కూతురు సమర్ గోవాలా తనయుడి ఇంటికి బర్త్ డే పార్టీ ఇన్విటేషన్‌పై వెళ్లిందని, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వెళ్లిన తన కూతురిని రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మళ్లీ ఇంటి దగ్గర డ్రాప్ చేశారని వివరించారు. ఒక మహిళ, ఇద్దరు పురుషులు తన కుమార్తెను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లారని తన భార్య చెప్పినట్టు తెలిపారు. వారెవరో తమకు తెలియదని అన్నారు. కానీ, ఆమె పార్టీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత రక్తస్రావం మొదలైందని అన్నారు. తర్వాతి రోజు ఉదయం ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వైద్యుడి కోసం తాము బయటకు వెళ్లామని వివరించారు. తిరిగి వచ్చే సమయానికి ఆమె మరణించిందని తెలిపారు. తన కుమార్తెను సమర్ గోవాలా కొడుకే రేప్ చేశాడని, వారిద్దరూ లవ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని పేర్కొన్నారు.

తమ కుమార్తెను ఇంటి దగ్గర దిగబెట్టిన వారు బెదిరించారని, తాము నోరు విప్పితే తమ ఇంటిని కాల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారని ఆ బాలిక తల్లి అన్నారు. అందుకే తాము మౌనంగా ఉన్నామని, కానీ, తమకు న్యాయం జరగాలని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.