న్యూఢిల్లీ: నిర్భయ కేసు నిందితుడు వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను క్షమాభిక్ష కోసం పిటిషన్ పై తాను సంతకం చేయలేదని వినయ్ శర్మ చెప్పాడు. క్షమాభిక్ష పిటిషన్ ను తక్షణమే ఉపసంహరించాలని అతను కోరాడు. క్షమాభిక్ష పిటిషన్ ను ఉపసంహరించుకోవడానికి తనకు అనుమతి ఇవ్వాలని తన తరఫు న్యాయవాది ఎపి సింగ్ ద్వారా వినయ్ శర్మ శనివారంనాడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కోరాడు.

కేంద్ర హోం శాఖ రాష్ట్రపతికి పంపిన క్షమాభిక్ష పిటిషన్ లో తన సంతకం లేదని, అది తాను పెట్టుకున్నది కాదని అతను చెప్పాడు. క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పంపిన సిఫార్సులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదించి రాష్ట్రపతికి పంపించింది. 

వినయ్ శర్మ సహా నిర్భయ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుగా కేసు నమోదైంది. ప్రధాన నిందుతుల్లో ఒక్కడైన రామ్ సిగ్ 2013 మార్చిలో జైలులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్ కావడంతో అతడికి బాల నేరస్థుల కోర్టుకు మూడేళ్ల  శిక్ష విధించి ఆ తర్వాత విడుదల చేసింది. ఇక నలుగురు మిగిలిన నలుగురు నిందితులు పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, ముఖేష్ సింగ్, వినయ్ శర్మలకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. 

అత్యాచారం కేసుల్లో నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించేది లేదని రాష్ట్రపతి ఇప్పటికే స్పష్టమైన సంకేతాలను పంపించారు. ఈ నెల 16వ తేదీతో నిర్భయ అత్యాచారానికి, హత్యకు గురై ఏడేళ్లవుతుంది. 2012 డిసెంబర్ 16వ తేదీన 23 ఏల్ల పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై దుండగులు అత్యాచారం చేసి, తీవ్రంగా హింసించి చంపేశారు.